అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్ హిందీలో ‘షెహజాదా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించాడు. అయితే, అక్కడ మాత్రం ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కలెక్షన్లు పెద్దగా రాలేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ‘షెహజాదా’ రిలీజ్ అయ్యేసరికే ‘అలా వైకుంఠపురంలో’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను చాలామంది చూసేశారు. పైగా, అందులో బన్నీ స్టైల్‌ను కార్తీక్ ఆర్యన్.. కొంచెం కూడా మార్పులేకుండా దించేశాడు. ‘అలా వైకుంఠపురం’ మూవీకి పాటలు కూడా ప్రాణం పోశాయి. హిందీలో అది లోపించింది. మొత్తానికి కార్తీక్ ఆర్యన్ కెరీర్‌లో ఈ మూవీ అతి పెద్ద డిజస్టర్‌గా నిలిచిపోయింది. తాజాగా ఈ మూవీ రిజల్ట్‌పై ఆర్యన్ స్పందించాడు. ఇక ఎప్పుడూ రీమేక్స్ జోలికి వెళ్లనని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 


కార్తీక్ ఆర్యన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ మూవీ తనకు ఒక అనుభవాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇక ఎప్పుడూ రీమేక్స్ చేకూడదని తెలియజెప్పిందని తెలిపాడు. “నేను ఇక రీమేక్‌లు చేయను. రీమేక్ మూవీ చేయడం ఇదే తొలిసారి. మూవీ షూటింట్ టైమ్‌లో ఆఫీల్ కలగలేదు. మూవీ ఫ్లాప్ తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకున్నా. ప్రజలు ఇప్పటికే ఆ మూవీని చూసేశారని, మళ్లీ వారు డబ్బులు ఖర్చు చేసి అదే సినిమా చూడటానికి థియేటర్లకు ఎందుకు వెళ్తారని అర్థం చేసుకున్నా. అదే నా కళ్లు తెరిపించింది’’ అని తెలిపాడు. 


‘‘ఇండస్ట్రీలో రీమేక్‌లు ఆగిపోతాయని అనుకోవద్దు. ఇంకా వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని రీమేక్ స్క్రిప్ట్‌లు నా దగ్గరకు వస్తుంటాయి. అయితే, ఆ రీమేక్ మూవీల వల్ల నాకు ఆనందం రాదని అర్థమైంది. ఎవరో చేసేసిన పనిని చేయడం నాకు ఇష్టం ఉండదు’’ అని ఆర్యన్ పేర్కొన్నాడు. ‘లవ్ ఆజ్ కల్-2’ మూవీ బాక్సాఫీస్ వద్ద పని చేయకపోయినప్పటికీ, ఆ సమయంలో అది తనకు అతిపెద్ద ఓపెనింగ్‌ని ఇచ్చిందని, అది తనకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పాడు. ఇటీవల విడుదలైన కార్తీక్ మూవీ ‘సత్యప్రేమ్ కి కథ’ చిత్రం పాజిటీవ్ రివ్యూలను సొంతం చేసుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘షెహజాదా’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.47.43 కోట్లు వసూలు చేసింది. ఇండియాన్ బాక్సాఫీస్‌లో రూ. 38.33 కోట్లు మాత్రమే వచ్చాయి. నిర్మాతగా అల్లు అరవింద్‌కు కూడా ఈ మూవీ నష్టాలు మిగిల్చింది.


‘షెహజాదా’ మూవీని దర్శకుడు రోహిత్ ధావన్ హిందీలో తెరకెక్కించారు. కార్తీక్ ఆర్యన్‌కు జంటగా కృతి సనన్ నటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య మూవీను విడుదల చేశారు మేకర్స్. అయితే తెలుగులో ఆకట్టుకున్నంతగా ఈ సినిమా హిందీ లో మెప్పించలేకపోయింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాను అల్లు అర్జున్ స్టైల్ తో సహా మక్కీకి మక్కీ దించేశారనే టాక్ రావడంతో తొలిరోజే ఈ సినిమా కలెక్షన్లకు గండిపడింది. దీంతో మూవీ అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీను అల్లు అరవింద్ సమర్పణలో టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్రాట్ ఫిలిమ్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై నిర్మించారు.


Also Read: ఇంత ప్రేమ? తెలుగు ప్రేక్షకుల వీరాభిమానంపై స్పందించిన సూర్య