నాస్తిక గిరిజన యువకుడు శివ భక్తుడుగా మారి తనదైన శైలిలో పూజలు జరిపి చివరికి ఆ శివుడినే ప్రత్యక్షం చేసుకున్న గాధ 'కన్నప్ప'ది. తిన్నడు 'భక్త కన్నప్ప'గా మారిన వైనం నిజంగా ఒక అద్భుతం. కృష్ణంరాజు తీసిన సినిమా వెనుక కథ తెలుసా?
రెబల్ స్టార్ డ్రీమ్ రోల్ -కన్నప్ప
చిన్న వయసులో తాను చూసిన...
'శ్రీ కాళహస్తి మహత్యం'లో కన్నప్ప పాత్ర కృష్ణం రాజుకు ఒక డ్రీమ్ రోల్. తాను హీరో అయ్యాక ఆ సినిమాను రీమేక్ చెయ్యాలని తన తమ్ముడు సూర్య నారాయణ రాజు (ప్రభాస్ తండ్రి ) నిర్మాతగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రముఖ డైరెక్టర్ వి. మధు సూదన రావు దర్శకుడిగా, మంజూలూరి భీమేశ్వర రావు స్క్రీన్ ప్లే రైటర్ గా, ఆది నారాయణ రావు సంగీత దర్శకుడిగా 'కన్నప్ప'ను రీమేక్ చేయడం కోసం టీమ్ రెడీ అయింది. అప్పట్లో డైరెక్టర్, రైటర్లపై కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉండేది. 'కన్నప్ప' గిరిజనుడి కథ కావడం, ముందు నాస్తికుడు అవ్వడంతో డైలాగుల్లో ఆ ప్రభావం ఎక్కువగా పడింది అట. ఎందుకో తెలియదు గానీ కృష్ణం రాజు ఆయన తమ్ముడు ఆ సినిమాను ఆపేసి బాపు - రమణలను తెరకెక్కించమని కోరారు. ఆ స్క్రిప్ట్ చదవిన బాపు - రమణలు "ఇది కామ్రేడ్ కన్నప్ప. మా వల్ల కాదు. మీకు భక్త కన్నప్ప కావాలంటే స్క్రిప్ట్ మళ్ళీ మాపద్దతిలో రాసుకోవాల్సిందే అని" మొహమాటం లేకుండా చెప్పేశారట. హీరోయిన్ గా వాణిశ్రీ అప్పటికి టాప్ లో ఉన్నారు. ఆమె డేట్స్ వేస్ట్ కాకూడదు. కాబట్టి ఒక పూట ఆలోచించుకున్న తర్వాత కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు బ్రదర్ ఇద్దరూ 'భక్త కన్నప్ప'కే ఓటు వేశారు. ఆ రోజుల్లోనే ఇది పెద్ద బడ్జెట్ చిత్రం అయ్యింది. ఎక్కువ భాగం ఔట్ డోర్ లో అదీ ఫారెస్ట్ లో తీశారు. VSR స్వామి కెమెరా వర్క్, 'ఆంధ్రా RD బర్మన్'గా పిలుచుకునే సత్యం మ్యూజిక్ టాప్ నాచ్ లో ఉంటాయి. అలాగే సినిమాలోని డ్రమ్స్ డాన్స్, ఫైట్ గురించి ఇండస్ట్రీ లో గొప్పగా చెప్పుకునే వారు. ఈ వివరాలన్నీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్న ఆత్మ కథ 'ముక్కోతి కొమ్మచ్చి' పుస్తకంలో స్వయంగా రాసుకున్నారు. 1976లో సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ కావడంతో పాటు ఒక్కసారిగా కృష్ణం రాజును టాప్ లీగ్ కి తీసుకుని పోయి కృష్ణ, శోభన్ బాబు సరసన నిలిపింది. కృష్ణంరాజుకే కాదు... శివుడిగా నటించిన బాలయ్యకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. పాటలన్నీ సూపర్ హిట్. 'భక్త కన్నప్ప' స్థాయి క్లాసిక్ అంటే సినిమా రిలీజ్ అయిన 50 ఏళ్ల వరకూ ఎవరూ దానిని రీమేక్ చెయ్యడానికి సాహసించ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు మంచు విష్ణు ఎన్నో కష్టాలు పడి నిర్మించిన 'కన్నప్ప' పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. భక్త కన్నప్పలో హీరో గా నటించిన కృష్ణం రాజు నట వారసుడు ప్రభాస్ "కన్నప్ప"లో రుద్ర పాత్రలో నటించడం విశేషం.
ఇంత వరకూ 7 సార్లు సినిమా గా వచ్చిన కన్నప్ప
కన్నప్ప కథ తొలిసారి సినిమా రూపంలో వచ్చింది 1938లో. 'కన్నప్ప నాయనార్' పేరుతో వచ్చిన ఈ సినిమాలో నాటి ప్రముఖ గాయకుడు, నటుడు VN సముద్రమ్ హీరోగా నటించారు. తరువాత 1954లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ 'బేడర కన్నప్ప' పేరుతో కన్నడలో, 'శ్రీ కాళహస్తి మహాత్యం' పేరుతో తెలుగులో ద్విభాషా సినిమా తీశారు. రెండు సినిమాలకూ HLN సింహా దర్శకత్వం వహించారు. కొద్ది నెలల గ్యాప్ లో విడుదలైన కన్నడ, తెలుగు వెర్షన్ లు రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కన్నడ కాకుండా రాజ్ కుమార్ నటించిన ఏకైక వేరే భాషా చిత్రం 'శ్రీ కాళహస్తి మహాత్యం' ఒక్కటే. తరువాతి ఏడాది అంటే 1955లో అదే డైరెక్టర్ హిందీలో 'శివ్ భక్త' పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. పౌరాణిక పాత్రలు వేసే హిందీ / మరాఠీ నటుడు సాహు మోదక్ ఇందులో కన్నప్పగా నటించారు. ఇది కూడా పర్వాలేదు అనిపించుకుంది. 1988లో కన్నడ లోరాజ్ కుమార్ తనయుడు శివ రాజ్ కుమార్ హీరోగా 'శివ మెచ్చిద కన్నప్ప' పేరుతో రీమేక్ చేశారు. అందులో రాజ్ కుమార్ శివుడి పాత్రలో నటించగా ఇటీవల మరణించిన పునీత్ రాజ్ కుమార్ బాల నటుడిగా కనిపిస్తారు.
Also Read: ఎవరీ ప్రీతి ముకుందన్? 'కన్నప్ప'లో విష్ణు మంచు జంటగా నటించిన హీరోయిన్ బ్యాగ్రౌండ్, కెరీర్ తెల్సా?