Dil Raju New Movie with Ram Charan News Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ - టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు తీసిన సినిమా 'గేమ్ చేంజర్'. భారీ అంచనాలతో సంక్రాంతికి థియేటర్లలో విడుదల అయ్యింది. బాక్స్ ఆఫీస్ బరిలో బోల్తా కొట్టింది. హీరోకి హిట్ ఇవ్వలేకపోయామని లోటు తమకు ఉందని 'దిల్' రాజు పేర్కొన్నారు. రామ్ చరణ్ హీరోగా మరో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
రామ్ చరణ్ హీరోగా మరో సినిమా...
త్వరలో అనౌన్స్ చేస్తామన్న 'దిల్' రాజు!
జూలై 4న 'తమ్ముడు' సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా సోమవారం రాత్రి రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అందులో 'దిల్' రాజు మాట్లాడుతూ... ''ఈ ఏడాది మాకు చిన్న లోటు 'గేమ్ చేంజర్'. రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ తీయలేకపోయామని చిన్న గిల్ట్ ఉంది. త్వరలో రామ్ చరణ్ హీరోగా ఒక సూపర్ హిట్ తీయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలో ఆ సినిమా అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు.
సంక్రాంతికి 'గేమ్ చేంజర్' బాక్సాఫీస్ దగ్గర నష్టాలు మిగిల్చినా... అదే పండక్కి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ లాభాలు తీసుకురావడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిలబడిందని 'దిల్' రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా పలు సందర్భాలలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి 'పెద్ది' సినిమా చిత్రీకరణతో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. సుకుమార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి 'దిల్' రాజు ఏ దర్శకుడిని రామ్ చరణ్ దగ్గరకు తీసుకు వెళుతున్నారో!? సినిమా మీద నమ్మకంతో జాలై 3న పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు తెలిపారు.
నితిన్ హీరోగా వివి వినాయక్ నిర్మించిన 'దిల్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాత ప్రయాణం మొదలైంది. అప్పటి వరకు పంపిణీదారుడిగా, నైజాం రాజుగా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన మనిషి పేరు 'దిల్' రాజు అయ్యింది... ఆయనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత. అసలు పేరు వెంకట రమణా రెడ్డి అనుకోండి. ఆ తర్వాత నితిన్ హీరోగా 'శ్రీనివాస కళ్యాణం' నిర్మించారు. కమర్షియల్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'తమ్ముడు' నిర్మించారు. ఈ సినిమా నితిన్ కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని 'దిల్' రాజు చెప్పారు.