మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ ఛాన్స్ ఒకసారి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దగ్గరకు వెళ్ళింది. స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. అయితే... ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. ఇదంతా ఇప్పటి సంగతి కాదు. పాతికేళ్ల క్రితం సంగతి! మరి, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అంటే... అప్పటి జ్ఞాపకాలను ఉపేంద్ర గుర్తు చేసుకున్నారు.
వరుణ్ తేజ్ 'గని' సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కు వచ్చారు. అప్పుడు మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుతో 'ఒకే మాట' సినిమాలో కలిసి నటించానని, అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో తెలుగులో మరోసారి రీ-ఎంట్రీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే... అంత కంటే ముందు చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పారు.
"నేను 'ఎ', 'ఉపేంద్ర' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు తెలుసు. దాని కంటే ముందు నాకు ఫ్యామిలీతో అనుబంధం ఉంది. పాతికేళ్ల క్రితం అనుకుంట... తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా 'ఓంకారం' సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాను. ఆ టైమ్ లో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది. నిర్మాత అశ్వినీదత్ చిరంజీవి గారి దగ్గరకు తీసుకు వెళ్లారు. ఆ సినిమా చేయలేకపోయా. ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతుంటా" అని ఉపేంద్ర చెప్పారు. మెగా ఫ్యామిలీ నన్ను మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: కోర్టు స్టే ఆర్డర్‌తో వర్మ భయపడ్డారా? లేదంటే థియేటర్ల నాన్ కోపరేషన్ కారణమా?