Rishab Shetty Upcoming Movies List: 'కాంతార'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. 2022లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఒక్క మూవీతోనే స్టార్ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం 'కాంతార ఫ్రీక్వెల్'తో బిజీగా మారారు. తన తర్వాత ప్రాజెక్టులను సైతం మైథలాజికల్, హిస్టారికల్, ఇతిహాసం బ్యాక్ డ్రాప్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రిషబ్. 

చరిత్రలో వీరుల జీవిత కథలతో పాటు పలు ఇతిహాసాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వివిధ నిర్మాణ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టులను తెరకెక్కించనున్నారు. వచ్చే ఐదేళ్లలో తాను చేయబోయే ప్రాజెక్టులకు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. హిస్టారికల్, ట్రెడిషనల్, మైథలాజికల్ జానర్లలో మూవీస్ రూపొందించనున్నారు. ఆ లిస్ట్ ఓసారి చూస్తే...

'కాంతార' ప్రీక్వెల్

రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేస్తుండగా... రిషబ్ శెట్టి హీరోగా చేస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో దానికి ముందు జరిగిన ఘటనలను ఇందులో చూపించనున్నారు. 'పుంజుర్లి' దేవునికి సంబంధించి మరిన్ని విశేషాలు ఈ మూవీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీకృష్ణ దేవరాయ చరిత్ర ఆధారంగా...

'శ్రీకృష్ణ దేవరాయలు' చరిత్ర ఆధారంగా తీయబోతున్న హిస్టారికల్ ప్రాజెక్టులో రిషబ్ టైటిల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని 'లగాన్', 'జోధా అక్బర్' వంటి హిస్టారికల్ డ్రామాలకు దర్శకత్వం వహించిన అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. విష్ణువర్దన్ ఇందూరు నిర్మించనుండగా... దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: లవ్ ఎంటర్‌టైనర్స్ To క్రైమ్ థ్రిల్లర్స్ - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ లిస్ట్ ఇదే

ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్

'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమాలోనూ రిషబ్ మరాఠీ యోధుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ సింగ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శివాజీ నాయకత్వం, వారసత్వం బ్యాక్ డ్రాప్‌గా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2027 జనవరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ హిస్టారికల్ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

1770 మూవీ

బంకించంద్ర ఛటర్జీ నవల 'ఆనంద్ మఠ్' ఆధారంగా '1770 మూవీ'ని తెరకెక్కించనుండగా రిషబ్ నటించనున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా... 'ఆకాశవాణి' ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. సన్యాసి తిరుగుబాటు నేపథ్యంలో ఈ మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 

జై హనుమాన్

హనుమంతుని కథ ఆధారంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న 'జై హనుమాన్' మూవీలో రిషబ్ హనుమంతుడిగా నటిస్తున్నారు. హనుమాన్ మూవీకి ప్రీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హనుమాన్ మూవీలానే ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. వరుస మైథలాజికల్, హిస్టారికల్ మూవీస్‌‌తో రిషబ్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు.