Kichcha Sudeep : కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును రిజెక్ట్ చేసిన స్టార్ హీరో సుదీప్... కారణం ఏంటో తెలుసా ?
Kichcha Sudeep : కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును రిజెక్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ అవార్డును తిరస్కరించడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు.

Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇటీవల కాలంలో తన స్టేట్మెంట్స్ తో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే 'బిగ్ బాస్ కన్నడ' షోకు సీజన్ 11 తరువాత గుడ్ బై చెప్తున్నాను అని ప్రకటించిన ఆయన' తాజాగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డును రిజెక్ట్ చేసి బాంబ్ పేల్చారు. పైగా సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అవార్డును తిరస్కరించడానికి గల కారణం ఏంటో వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే?
2019లో సుదీప్ హీరోగా నటించిన 'పైల్వాన్' అనే మూవీ రిలీజ్ అయింది. అయితే అప్పటి సినిమాకు తాజాగా కర్ణాటక స్టేట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ గా సుదీప్ ను అనౌన్స్ చేశారు. అయితే సుదీప్ మాత్రం కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును సున్నితంగా తిరస్కరిస్తూ, చాలా కాలం నుంచి తను అవార్డులను తీసుకోకూడదని డిసైడ్ అయ్యానని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన నోట్ షేర్ చేశారు. సుదీప్ ను బెస్ట్ యాక్టర్ గా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ అవార్డును రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. జనవరి 22న, కర్ణాటక ప్రభుత్వం 2019 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. హీరోయిన్ అనుపమ గౌడ, సుదీప్ బెస్ట్ యాక్టర్స్ గా ఎంపికయ్యారు. కరోనా కారణంగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను ఐదేళ్ల తరువాత ప్రకటించారు. 2020, 2024 మధ్య చలనచిత్రాలకు రాష్ట్రం అవార్డులను ఇంకా ప్రకటించలేదు.
రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనట...
ఈ మేరకు సుదీప్ షేర్ చేసిన ఆ సుదీర్ఘమైన నోట్ లో "గౌరవనీయులైన కర్ణాటక ప్రభుత్వ అవార్డుల జ్యూరీ సభ్యులు, బెస్ట్ యాక్టర్ గా ఈ అవార్డును అందుకోవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఈ గౌరవాన్ని అందించిన జ్యూరీ మెంబర్స్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయినప్పటికీ నేను చాలా సంవత్సరాల క్రితమే అవార్డులను అందుకోకూడదు అనే నిర్ణయాన్ని తీసుకున్నాను. పలు వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. కాబట్టి ఇప్పటికీ దీన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఇక ఇండస్ట్రీలో చాలామంది అర్హత గల నటులు ఉన్నారు. వాళ్లంతా ప్రాణం పెట్టి మరీ యాక్టింగ్ లో తమ నైపుణ్యాన్ని అద్భుతంగా తెరపై చూపిస్తున్నారు. నాకంటే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును వాళ్లకి ఇస్తే ఎక్కువగా సంతోషిస్తారు.
అలాగే వాళ్లలో ఒకరు అవార్డును అందుకుంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నేను ఎలాంటి అవార్డులను ఎక్స్పెక్ట్ చేయకుండానే జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు జూరీ నుంచి వచ్చిన ఈ అంగీకారం నేను మరింత కష్టపడడానికి బూస్ట్ ఇస్తుంది. నన్ను బెస్ట్ యాక్టర్ గా సెలెక్ట్ చేసినందుకు ప్రతి ఒక్క జ్యూరీ సభ్యునికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ గుర్తింపు నా కష్టానికి ప్రతిఫలం. నా నిర్ణయం ఏదైనా నిరాశ కలిగించి ఉంటే సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీరు నా చాయిస్ ని గౌరవిస్తారని, నేను ఎంచుకున్న ఈ దారిలో నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నా కృషిని గుర్తించి ఈ అవార్డుకు నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు గౌరవ జూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు" అంటూ రాస్కొచ్చారు.
Read Also : Rashmika Mandanna : ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా రిటైర్ అవుతా... 'ఛావా' ఈవెంట్లో రష్మిక షాకింగ్ కామెంట్స్