బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎలాంటి కామెంట్ చేసినా అది కాస్త సెన్సేషన్ అవుతుంటుంది. సినిమాలపరంగా, వ్యక్తిగతంగా ఆమె ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా తన పెళ్లి పై కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లితోపాటు తన బ్రేకప్స్ గురించి కూడా మాట్లాడింది కంగనా. ఇంతకీ పెళ్లి, బ్రేకప్స్ గురించి కంగనా ఏం చెప్పింది? డీటెయిల్స్ లోకి వెళ్తే.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'తేజస్'(Tejas). సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.


ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న కంగనాకి ఈ మూవీ మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలిపింది. దాంతోపాటు గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్స్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పెళ్లి గురించి మాట్లాడుతూ.." ప్రతి అమ్మాయి తన పెళ్లి కుటుంబం గురించి కలలు కంటుంది. నేను కుటుంబ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. పెళ్లి చేసుకుని నాకంటూ ఒక కుటుంబం ఉండాలని కోరుకుంటాను. ఇదంతా రానున్న ఐదేళ్లలో జరుగుతుంది. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే బాగుంటుంది" అని చెప్పుకొచ్చింది.


ఇక ఆ తర్వాత తన గత రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.." రిలేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. రిలేషన్ షిప్స్ లో అందరూ సక్సెస్ అవ్వలేరు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో ఫెయిల్ అయ్యాను. దానివల్ల నాకు ఒక విధంగా మంచే జరిగింది. నేను ప్రేమలో ఉన్నట్లయితే నా సమయం అంతా దానికే కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు ఆ బంధం నిలవలేదు. దేవుడు నన్ను రక్షించాడు. ప్రేమ విఫలమవడం వల్ల జరిగే ప్రయోజనాన్ని చాలామంది జీవితంలో చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు" అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది కంగనా రనౌత్. దీంతో కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి కంగనా చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే మ్యారేజ్ విషయంలో కంగనాకి ఓ క్లారిటీ ఉన్నట్లు స్పష్టమవుతుంది.


ఇక 'తేజస్' విషయానికొస్తే.. ఈ సినిమాలో కంగనా భారతీయ వాయుసేన పైలట్ గా కనిపించనుంది. 2016లో భారత వైమానిక దళం మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ స్క్రిప్ట్ చదవగానే తేజస్ పాత్రకి కంగనా అయితే బాగుంటుందని అనిపించినట్లు దర్శకుడు సర్వేశ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా ఆమె ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అన్నారు. అటు కంగనాకి కూడా ఈ స్క్రిప్ట్ వినిపించగానే ఆమె భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, వైశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. మరి బాలీవుడ్ క్వీన్ కంగనా కి 'తేజస్' ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.


Also Read : సోషల్ మీడియాని ఊపేస్తోన్న ఫ్యామిలీ స్టార్' డైలాగ్ - స్పందించిన విజయ్ దేవరకొండ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial