Happy Birthday Kamal Haasan: ఎలాంటి పాత్ర అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేసే గొప్ప నటుడాయన. కేవలం తన హావభావాలతోనే ప్రేక్షకుల మనసులను కట్టిపడేసే నటన ఆయన సొంతం. ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా, ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూ నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపించే కథానాయకుడు ఉలగనాయగన్ కమల్ హాసన్. గత ఆరు దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో అలరిస్తూ వస్తున్నారు. ఆరేళ్ళ ప్రాయంలోనే తెరంగేట్రం చేసిన కమల్.. ఇన్నేళ్ళలో ఎవరికీ సాధ్యంకాని సాహసాలు చేశారు. ఎవరూ సాధించని అవార్డులు అందుకున్నారు. 'యూనివర్సల్ స్టార్' గా, 'లోకనాయకుడి'గా, 'విశ్వనటుడు'గా పిలవబడుతున్న దిగ్గజ నటుడు.. నేడు తన 69వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.  


6 ఏళ్ళ ప్రాయంలో తెరంగేట్రం...
1954 నవంబర్ 7వ తేదీన జన్మించారు కమల్ హాసన్. 6 ఏళ్ళ వయసులో 1960లో 'కలాతూర్ కన్నమ్మ' చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. డెబ్యూ మూవీతోనే బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా రాష్ట్రపతి అవార్డుని అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కమల్.. అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేశారు. 1974లో 'కన్యాకుమారి' అనే మలయాళ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారి, తొలి చిత్రంతోనే బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత బాషా బేధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోయారు. తన అద్భుతమైన నటనతో కేవలం సౌత్ లోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు.


క్యామియోతో టాలీవుడ్ ఎంట్రీ...
1976లో 'అంతులేని కథ' సినిమాలో క్యామియో చేయడంతో తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించారు కమల్ హాసన్. ఆ తర్వాత ‘మరో చరిత్ర’ మూవీతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీలో రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘కబితా’ అనే బెంగాలీ సినిమా, ‘కోకిల’ అనే కన్నడ చిత్రంలో నటించారు. 'ఇది కథ కాదు' 'ఆకలి రాజ్యం' 'భామనే సత్య భామనే' 'పుష్పక విమానం' 'ఇంద్రుడు చంద్రుడు' 'స్వాతి ముత్యం' 'సాగర సంగమం' 'శుభ సంకల్పం' 'భారతీయుడు' 'దశావతారం' 'విశ్వరూపం' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాల్లో నటించారు. కె. బాలచందర్ తో చేసిన సినిమాలు కమల్ ని హీరోగా నిలబెడితే, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రాలు స్టార్ డమ్ ని తెచ్చిపెట్టాయని చెప్పాలి. 


'విక్రమ్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తున్నారు. అలానే మణిరత్నం డైరెక్షన్ లో 'థగ్ లైఫ్' అనే భారీ సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో 'ఇండియన్ 3', 'కల్కి 2898 AD' చిత్రాలు రాబోతున్నాయి. 'విక్రమ్ 2', వినోద్ KH 233 ప్రాజెక్ట్స్ కూడా కమల్ లైనప్ లో ఉన్నాయి. 


నటుడిగా 63 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న కమల్ హాసన్.. ఇప్పటి వరకూ 230కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఆరు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నందుకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను 'పద్మశ్రీ' 'పద్మభూషణ్' వంటి పురష్కారాలతో సత్కరించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందుండే కమల్.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పొలిటికల్ పార్టీ స్థాపించి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, సింగర్‌గా, డాన్సర్‌గా, టెలివిజన్ హోస్టుగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ వేత్తగా.. ఇలా సినీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కమల్ హాసన్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని 'Abp దేశం' మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 


Also Read: Happy Birthday Trivikram: 'మాటల మాంత్రికుడు' త్రివిక్రముడి సినీ ప్రస్థానంలోని విశేషాలు!