కోలీవుడ్ సీనియర్ హీరో, విశ్వ నటుడు కమల్ హాసన్ గత ఏడాది 'విక్రమ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నారు. కోలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు కమల్ హాసన్. ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఆ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత మణిరత్నంతో కమల్ ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. 'KH 234' గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుతో పాటు 'విక్రమ్ 2' కూడా చేయాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమాకు కాస్త సమయం పడుతుంది.


ఈ గ్యాప్ లో ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యారు కమల్ హాసన్. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోను అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై స్వయంగా కమల్ హాసన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 'KH 233' అనే వర్కింగ్ టైటిల్ తో తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక ఈ వీడియోలో బీజీయం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే ఈ వీడియోలో సినిమా కాన్సెప్ట్ పై హింట్ ఇస్తూ కమల్ హాసన్ స్కెచ్ డిజైన్ చేశారు. ఇందులో కమలహాసన్ చేతిలో మండుతున్న కాగడ పట్టుకుని గర్జిస్తున్నట్లు కనిపించారు. అలాగే టైటిలో లో 'రైజ్ టూ రూల్'(Rise To Rule) అని ఉంది. అంటే ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రజల తరుపున పోరాడే పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.


మొత్తం మీద అనౌన్స్మెంట్ వీడియో తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా 'ఇండియన్ 2' తర్వాత ఈ ప్రాజెక్టు లెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.. ఆ తర్వాతే మణిరత్నం ప్రాజెక్ట్ ఉంటుందట. ఇక డైరెక్టర్ హెచ్ వినోద్ విషయానికొస్తే.. కోలీవుడ్లో 'సతురంగ వేట్టెయ్' చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి, మొదటి చిత్రంతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కార్తీతో 'ఖాకి' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. దాని నిరంతరం వరుసగా అజిత్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఈ దర్శకుడు ఇప్పటివరకు అజిత్ తో మూడు సినిమాలు చేయడం విశేషం. వినోద్  -  అజిత్ కాంబోలో ఇప్పటివరకు 'నేర్కొండ పార్ వై', 'వలిమై', 'తెగింపు' వంటి సినిమాలు వచ్చాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి విడుదలైన 'తెగింపు' సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ పరంగా ఆదరగొట్టేసింది. ఇక తెగింపు తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ తోనే తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు వినోద్. మరి ఈ సినిమాతో కమల్ కి ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ అందిస్తారో చూడాలి.