Kamal Haasan Shows Love To His Own Language: కన్నడ భాషపై తన కామెంట్స్ వివాదం రేపిన వేళ కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్‌కు కర్ణాటకలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరోసారి దీనిపై స్పందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సొంత భాషపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు.
'థాంక్యూ తమిళనాడు'
ఈ వివాదం గురించి మాట్లాడిన కమల్.. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 'ఇలాంటి టైంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన తమిళనాడు రాష్ట్రానికి ధన్యవాదాలు. నా ప్రాణం, నా కుటుంబం తమిళమే అన్న వ్యాఖ్యలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆ కామెంట్స్‌కు కట్టుబడి ఉంటాను. ఎన్నో అంశాల గురించి మాట్లాడాల్సి ఉంది. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం, వేదిక కాదు. ఆయా అంశాల గురించి తప్పకుండా మీటింగ్ పెట్టి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. కచ్చితంగా ఆ పనిచేస్తా.' అంటూ పేర్కొన్నారు.
జూన్ 5న రిలీజ్
ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్క కన్నడలో తప్ప తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా నటిస్తున్నారు. సినిమాలో శింబు కీలక పాత్ర పోషించగా.. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి కమల్ నిర్మాతగానూ వ్యవహరించారు. హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటంటే?
'థగ్ లైఫ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఈవెంట్‌లో కమల్ హాసన్ కన్నడ భాషపై కామెంట్స్ చేశారు. 'తమిళం కన్నడ నుంచే పుట్టింది' అంటూ కామెంట్ చేయగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక అధికార, విపక్ష సభ్యులతో పాటు కన్నడిగులు డిమాండ్ చేశారు. అయితే, తన కామెంట్స్ సమర్థించుకున్న కమల్.. సారీ చెప్పేందుకు నిరాకరించారు. తాను అన్నీ భాషలను గౌరవిస్తానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో 'థగ్ లైఫ్' మూవీని బ్యాన్ చేయాలంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును సైతం ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం కమల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టు చెప్పినా సారీ చెప్పేందుకు ఇష్టపడని కమల్ కేఎఫ్‌సీసీకి ఓ లెటర్ రాశారు. కర్ణాటకలో తన మూవీ రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు.
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు
మరోవైపు.. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 1 నుంచి ప్రీ బుకింగ్స్ మొదలుకాగా ఇప్పటివరకూ వసూళ్లు రూ.15 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అన్నీ భాషల్లోనూ దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం.