TDP Jr. NTR Fans WAR: మరికొద్ది గంటల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 థియేటర్లలోకి రాబోతోంది. సినిమా War స్క్రీన్‌ల మీదకు రావడానికి ముందే.. సోషల్‌మీడియా వార్ స్టార్ట్ అయిపోయింది. NTR ఫ్యాన్స్ – TDP సపోర్టర్లు ఆన్‌లైన్‌లో రచ్చ రేపుతున్నారు. సినిమా ప్రమోషన్‌ల వీడియోల కంటే.. వీళ్లు గొడవపడుతున్న విషయమే ఎక్కువుగా హైలైట్ అవుతోంది.
యుశ్‌రాజ్ ఫిల్మ్స్ YRF నిర్మిస్తున్న Spy యూనివర్స్‌లో War-2 లేటెస్ట్ వెంచర్. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కావడంతో యంగ్‌టైగర్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఈ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే హంగామాతో పాటు.. సోషల్‌మీడియాలో మరో రచ్చ కూడా మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు… తెలుగుదేశం TDP సపోర్టర్స్‌కు మధ్య ట్విటర్, Instagramలో వార్ మొదలైంది.
NTR ఫ్యాన్స్ Vs TDP
సినిమా రిలీజ్‌టైమ్‌లో ఈ చిరాకేంటన్నదాని వెనుక చాలా స్టోరీనే ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, సినీ లెజెండ్ సీనియర్ NTR వారసుడిగా నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ జూనియర్‌కు మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలిచారు. మధ్యలో వచ్చిన గ్యాప్‌తో జూనియర్ కొంతకాలం పార్టీకి దూరంగా జరిగినా పార్టీ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం కొనసాగింది. అయితే ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీపై YSRCP చేసిన మాటల దాడులు, ముఖ్యంగా చంద్రబాబు, నందమూరి కుటుంబంపై చేసిన వ్యక్తిత్వ దాడులపై జూనియర్ సైలంట్‌గా ఉండటం తెలుగుదేశం అభిమానుల కోపానికి కారణం అయింది. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నప్పటికీ.. మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్టీఆర్, తరపున కల్యాణ్ రామ్ తాము ఎవరికీ సపోర్ట్ ఇవ్వడం లేదని ‘ప్రత్యేకంగా’ చెప్పడంతో విషయం చాలా దూరం పోయింది. దాదాపుగా టీడీపీకి ఎన్టీఆర్ దూరం అయిపోయారు. అదే సమయంలో టీడీపీలోని ఎన్టీఆర్ ఫాన్స్ ఆయన్ను సినిమా పరంగా సపోర్ట్ చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యలు కలకలం
వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మూడు రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగింది. ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా తెలుగుదేశం క్యాడర్‌కు కొంచం ఇబ్బంది కలిగించాయి. పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకూ తనకు ఎదురులేదు అని చెప్పడం.. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకపోవడం... వంటి విషయాలతో టీడీపీ సానుభూతిపరులు కొంచం కోపంగా ఉన్నారు. సరిగ్గా అదే టైమ్‌లో ఆన్‌లైన్ వార్ మొదలైంది.
TDPని టార్గెట్ చేసిన NTR ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ వైఖరిని, మాటలను సపోర్ట్ చేస్తూ.. ఆయన అభిమానుల పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్స్ ఎన్టీఆర్‌ను సపోర్ట్ చేయడం ప్రారంభించాయి. కుటుంబంలోని వారే ఎన్టీఆర్‌ను దూరం పెట్టారని..( నందమూరి బాలకృష్ణ గురించి), చంద్రబాబు ఎన్నికల్లో వాడుకుని వదిలేశారని... జూనియర్ కష్టపడి స్వయంగా ఎదిగారంటూ మాటలు మొదలుపెట్టారు. ఒకరంటూ స్టార్ట్ చేశాక అది ఇంక ఆగదు కదా.. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. జూనియర్‌ను ఎవ్వరూ పార్టీకి దూరం పెట్టలేదని.. తనంతట తానే దూరంగా వెళ్లిపోయాడని.. పార్టీపై దారణ వ్యాఖ్యలు చేసిన కొడాలినాని, వల్లభనేని వంశీ వంటి వారితో సన్నిహితంగా ఉన్నాడని ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబమైన భువనేశ్వరి, బ్రహ్మణి వంటివారిపై దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ జూనియర్ సైలంట్‌గా ఉండటంపై టీడీపీ ఫాన్స్‌లో ఎప్పటి నుంచో కోపం ఉంది. అన్నిటికంటే ఎక్కువుగా NTR శత జయంతి ఉత్సవాలకు అతను హాజరుకాకపోవడం వారిని చాలా బాధించింది. దీనికి కౌంటర్‌గా NTRను సరిగ్గా ఆహ్వానించలేదని.. క్రమంగా పార్టీకి, కుటుంబానికి దూరం చేశారని ఆయన ఫ్యాన్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగా పెద్ద డిబేట్‌కు దారి తీసింది.
TDP కోపం వార్-2 పై ఉంటుందా..?
జూనియర్ NTR పై టీడీపీ వాళ్ల కోపం చాలా కాలంగా ఉంది. NTR అద్భుతమైన నటుడే అయినా నందమూరి ఫాన్స్, టీడీపీ సపోర్టర్ల వల్లనే స్టార్‌గా ఎదిగాడన్నది నిజం. వాళ్ల సపోర్ట్ ఆగిపోతే.. రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది. ఎన్టీఆర్ వైఖరిని రాజకీయంగా తప్పుపట్టినా.. నందమూరి ఫాన్స్ మాత్రం తన పట్ల ఆదరణను కొనసాగిస్తూనే ఉన్నారు. నందమూరి నటవారసుడిగా సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఇంకా కొనసాగుతున్నారు. అంతే కాదు.. గడచిన 4 ఏళ్లలో బిగ్గెస్ట్ హిట్స్ కొడుతున్నారు. బాలకృష్ణకు -NTRకు దూరం పెరిగినా నందుమూరి అభిమానులు మాత్రం ఇద్దరి సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే TDP ఫాన్స్ ఎెలా తీసుకుంటారు అన్నది ఇంకా తేలలేదు.
RRR సినిమా టైమ్ కు గ్యాప్ ఉన్నా... ఇంత తీవ్రంగా లేదు. పైగా 2024 ఎన్నికలకు ముందు కల్యాణ్‌రామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పూర్తిగా డివైడ్ అయిపోయింది. శతజయంతికి రాకపోవడం, కుటుంబ సభ్యుల మీద దాడిని పట్టించుకోకపోవడం.. అన్నింటికీ మించి ఎలక్షన్ ముందు స్టేట్‌మెంట్‌తో ఆల్‌మోస్ట్ ఎన్టీఆర్ పార్టీకి దూరం అయిపోయాడు.. ఆ ప్రభావం కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాపై కనిపించింది. డీసెంట్ మూవీగా, మంచి స్టోరీ ఉన్నా కూడా ఫ్యాన్స్ బలం లేకపోవడంతో ఆ సినిమా తొలిరోజు ఓపెనింగ్స్ రాలేదు.
వార్ -2 రేపు గురువారం రిలీజ్ అవుతోంది. TDP, నందమూరి ఫ్యామిలీతో బాగా గ్యాప్ వచ్చిన తర్వాత వస్తున్న NTR సినిమా ఇది. పైగా ఈ సినిమాకు మొన్నటి వరకూ పెద్దగా బజ్ లేదు. యశ్‌రాజ్ కూడా అంతగా ప్రమోట్ చేయలేదు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు వరకూ జూనియర్ ఎన్టీఆర్ స్థాయి మూవీ హంగామా తెలుగు రాష్ట్రాల్లో కనబడలేదు. జూనియర్‌కు సొంతంగా ఫాన్ బేస్ ఉండటం, యశ్‌రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కావడంతో కొంత అంచనాలున్నాయి.
తెలుగుదేశం శ్రేణులైతే ఈ సినిమాను ఇంతకు ముందు జూనియర్ మూవీస్‌లా పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు జరిగిన సంఘటనలకు తోడు.. ప్రి రిలీజ్‌లో మాట్లాడిన మాటలు, అలాగే కొన్నిచోట్ల.. NTR CM అంటూ అత్యుత్సాహపు ఫాన్స్ చేస్తున్న హంగామా.. వంటివి మరింత దూరాన్ని పెంచేశాయి. అంతే కాదు… రజనీకాంత్ కూలీ మూవీకి విషెష్ చెప్పిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ .. NTR మూవీ గురించి ఏం మాట్లాడలేదు. ఇది ఓ రకమైన సూచన కూడా కావొచ్చు. ఏదేమైనా WAR-2 జూనియర్ ఎన్టీఆర్ రియల్ స్టామినాకు పరీక్ష.