Jr NTR 6 to 8 Weeks Rest: టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. శనివారం సాయంత్రం జరిగిన షూటింగ్‌లో ఆయన భుజానికి గాయం కావడంతో వైద్య నిపుణుల బృందం తక్షణమే ఆయనను పరిశీలించి చికిత్స అందించింది. ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, భుజం గాయం పూర్తిగా నయం కావడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ అనూహ్య పరిణామంతో ఎన్టీఆర్ అభిమానులు , చిత్ర పరిశ్రమ వర్గాలు కొంత ఆందోళనకు గురైనప్పటికీ, ఆయన బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తారక్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేవలం వైద్యుల సూచనల మేరకు కోలుకోవడానికి తగిన సమయం ఇస్తున్నామని తెలిపింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, కంగారు పడేందుకు ఎలాంటి తీవ్రమైన కారణం లేదని ప్రకటించారు.
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి , ఆయన కోలుకుంటున్న తీరుపై ఎప్పటికప్పుడు అధికారిక వర్గాల నుంచి తాజా సమాచారాన్ని అందిస్తామని పిఆర్ టీమ్ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎలాంటి అనవసరమైన పుకార్లు, అపోహలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. క్రమం తప్పకుండా అధికారిక హెల్త్ అప్‌డేట్స్ ద్వారా అభిమానులకు వివరాలు తెలియజేస్తామని, అంతవరకు అందరూ సహనంతో వ్యవహరించాలని కోరింది.
ఈ గాయం, వైద్యులు సూచించిన సుదీర్ఘ విశ్రాంతి సమయం కారణంగా ఎన్టీఆర్ రాబోయే సినిమాల షూటింగ్‌లకు కొంత విరామం కలగనుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్టుల షూటింగ్ షెడ్యూళ్లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి పూర్తయిన తర్వాతే ఆయన తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. అభిమానులు చూపిస్తున్న అపారమైన అభిమానం, మద్దతు , సహనానికి ఎన్టీఆర్ టీమ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
