Chennamaneni Vasudev Rao Making His Tollywood Debut With Silk Saree Movie: చెన్నమనేని వాసుదేవ్ రావు... తెలుగు టీవీ సీరియల్స్ చూసే జనాలకు పరిచయమైన పేరు. 'జానకి కలగనలేదు' సీరియల్‌లో విక్రమ్ ఐపీఎస్ పాత్రలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. 'యువ' సీరియల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... అంతకు ముందు 'భార్యామణి', 'రామ సీత', 'కస్తూరి', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'విశ్వాచార్యుడు', 'అక్క మొగుడు' తదితర సీరియల్స్ చేశారు. వెబ్ సిరీస్ 'ఎక్స్‌పోజ్డ్'లోనూ నటించారు. ఇప్పుడు ఆయన హీరోగా వెండితెరకు వస్తున్నారు.
'సిల్క్ శారీ'తో హీరోగా వాసుదేవ్ రావు!
Chennamaneni Vasudeva Rao First Movie As Hero: చెన్నమనేని వాసుదేవ్ రావు హీరోగా నటిస్తున్న సినిమా 'సిల్క్ శారీ'. టి. నాగేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. చాహత్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కమలేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రాహుల్ అగర్వాల్, హరీష్ చండక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో వాసుదేవ్ రావు సరసన రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా 'సిల్క్ శారీ' ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు.
Also Read: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
పేరుతో పాటు డబ్బులు కూడా రావాలి: రాజ్ కందుకూరి
'సిల్క్ శారీ' ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశాక రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ''ఈ సినిమా టైటిల్ బావుంది. 'సిల్క్ శారీ'ని ఖర్చుకు వెనుకాడకుండా తీస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గ్రాండియర్ కనిపించింది. టీజర్, ఫస్ట్ లుక్ ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. దర్శక నిర్మాతలకు పేరుతో పాటు డబ్బు కూడా రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను సినిమా ఆకట్టుకోవాలని ఆశిస్తున్నా'' అని చెప్పారు.
బలమైన కథ, డ్రామాతో తీసిన చిత్రమిది: వాసుదేవ్ రావు
'సిల్క్ శారీ'తో హీరోగా పరిచయం అవుతున్న వాసుదేవ్ రావు మాట్లాడుతూ... ''మా దర్శకుడు నాగేందర్ మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా లావిష్‌గా తీశారు. మా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. బలమైన కథ, అందుకు తగ్గట్టుగా మంచి డ్రామా సన్నివేశాలు రాసుకుని ఒక ఆసక్తికరమైన సంఘటన చుట్టూ తీసిన చిత్రమిది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంటుందని నమ్మకం ఉంది'' అని చెప్పారు.
చెన్నమనేని వాసుదేవ్ రావు హీరోగా, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఓంకార్ నాథ్ శ్రీశైలం, కోటేష్ మానవ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి దర్శకత్వం: టి. నాగేందర్, నిర్మాణం: కమలేష్ కుమార్ - రాహుల్ అగర్వాల్ - హరీష్ చండక్, నిర్మాణ సంస్థ: చాహత్ ప్రొడక్షన్స్, సంగీత దర్శకుడు: వరికుప్పల యాదగిరి, ఛాయాగ్రహణం: సనక రాజశేఖర్.