Jailer 2 SRK And Others Cameos Plan Shelved: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'జైలర్ 2' ఒకటి. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'జైలర్'కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మొదటి పార్ట్ డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో కొన్ని పాత్రలను కట్ చేశారని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...
'జైలర్ 2'లో షారుఖ్ కూడా లేడా?'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, హిందీ స్టార్ జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించారు. వాళ్ళ సన్నివేశాలకు రెస్పాన్స్ అదిరింది. అందుకని, 'జైలర్ 2'లో కూడా కొన్ని అతిథి పాత్రలు ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారని తొలుత వినిపించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... షారుఖ్ రోల్ కూడా లేదట.
Also Read: NTR Dragon Latest Update - శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'కింగ్' (King) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల 'జైలర్ 2' ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. దాంతో ఆ పాత్రకు ఒక దశలో హృతిక్ రోషన్‌ను సంప్రదించాలని అనుకున్నప్పటికీ... ఇప్పుడు ఆ రోల్ పూర్తిగా తీసేశారట. 'జైలర్ 2'లో బాలకృష్ణ కూడా అతిథి పాత్ర చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే... ఆయనకు ఆ పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ టాక్. దాంతో 'జైలర్ 2'లో ఇంతకు ముందు అతిథి పాత్రలు చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మళ్ళీ కనిపించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సమ్మర్ వెకేషన్‌లో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత జూన్ 8 లేదా 9న ప్యాచ్ వర్క్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
Also Read: Janhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు
'జైలర్ 2'లో ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి రజనీకాంత్ కనిపిస్తారు. ఈ సీక్వెల్‌లో మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 'జైలర్ 2' తర్వాత అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'తలైవర్ 173' చేయనున్నారని కోలీవుడ్ టాక్. అది కాకుండా కమల్ హాసన్‌తో కలిసి నెల్సన్ దర్శకత్వంలో 'KHxRK Reunion' కూడా చేయనున్నారు. ఆ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు.
