చాలావరకు సినీ పరిశ్రమలో పనిచేసే హీరోహీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకరితో ఒకరు సన్నిహితంగానే ఉంటారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నవారికి హీరోలను, ఇతర నటీనటులను గమనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలావరకు ప్రతీ హీరోతో కలిసి నటించే అవకాశం ఉంటుంది కాబట్టి కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు వారికి చాలా దగ్గరవుతారు. అలా ఒకప్పుడు హీరోగా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న జగపతి బాబుకు ప్రభాస్‌తో మంచి స్నేహం ఉంది. అసలు ప్రభాస్ ఎలాంటివాడు? తనతో ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఉదాహరణతో సహా బయటపెట్టారు జగపతి బాబు. 


ప్రభాస్ అంటేనే మంచివాడు..
స్నేహితులు అవ్వాలంటే సినిమాల్లో కలిసి నటించాల్సిన అవసరం లేదు. కొందరు హీరోలకు కొందరు ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ వారు కలిసి చాలా తక్కువ సినిమాలే చేసుంటారు. జగపతి బాబు, ప్రభాస్ స్నేహం కూడా అలాంటిదే. వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలు చేయలేదు. అయినా కూడా ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు అని చాలాసార్లు బయటపెట్టాడు జగపతి బాబు. ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చాలా మంచి వ్యక్తి అని చెప్తుంటారు. అలాగే జగపతి బాబు కూడా చెప్పారు. పైగా అలా అనడానికి కారణం ఏంటి అని ఒక ఉదాహరణతో సహా వివరించారు. 


డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సాయం..
ఒకసారి ప్రభాస్.. జార్జియాలో ఉన్న సమయంలో జగపతి బాబు డిప్రెషన్‌లో ఉండి తనకు ఫోన్ చేశాడట. ఫోన్ చేసి తన సమస్య ఏంటో చెప్పి డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పాడట జగపతి బాబు. దానికి సమాధానంగా ప్రభాస్.. ‘డార్లింగ్ నేను ఉన్నాను కదా.. నీ సమస్య ఏంటో చెప్పు.. నేను చూసుకుంటాను కదా’ అన్నాడట. అనడం మాత్రమే కాకుండా వెంటనే జార్జియా నుంచి జగపతి బాబును కూడా కలవడానికి కూడా వచ్చాడట. ఈ విషయాన్ని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. ‘ప్రభాస్ అనేవాడు నాకు చాలా ఇష్టమైన మనిషి. ఎందుకంటే తనకు ఇవ్వడం మాత్రమే తెలుసు కానీ అడగడం తెలియదు. ఎవరు అడిగినా, ఏం అడిగినా ఇచ్చేస్తాడు. తను నాకంటే చిన్నవాడే అయినా కూడా స్పందించాడు. నా సమస్యను తీర్చాడు’ అన్నారు జగపతి బాబు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మాట్లాడడానికి మనిషి కావాలి అన్నప్పుడు ప్రభాస్.. తనతో ఉన్నాడని చెప్పారు.


కేవలం రెండు సినిమాలే..
ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న జగపతి బాబు.. హీరోగా కంటే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాతే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా చేసినప్పుడు అందని అవార్డులు, గుర్తింపు అంతా విలన్‌గా చేసినప్పటి నుండే జగపతి బాబును వరించడం మొదలుపెట్టాయి. అలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ప్రభాస్‌తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటించారు. ఆ మూవీలో జగపతి బాబుది చాలా చిన్న రోల్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన ఆయన క్యారెక్టర్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.


Also Read: సిమ్రాన్ నా క్లాస్‌మేట్, వడ్డే నవీన్ అలా ఎందుకు చేశాడో అర్ధం కాలేదు: వేణు తొట్టెంపూడి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial