జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాకింగ్ రాకేష్. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అతను.. స్టేజ్ ప్రోగ్రామ్స్, కామెడీ షోల ద్వారానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. అయితే ఉన్నట్టుండి తన స్వీయ నిర్మాణంలో 'KCR' (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తెలంగాణ మినిస్టర్ మల్లారెడ్డితో టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేయించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
రాకేష్ ప్రధాన పాత్రలో గరుడవేగ అంజి దర్శకత్వంలో 'KCR' సినిమా తెరకెక్కుతోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో ఇటీవల టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆసక్తికరమైన టైటిల్ తో పాటుగా, ఫస్ట్ లుక్ లో రాకేశ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కటౌట్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. అది కూడా ఎన్నికల సమయంలో ఈ సినిమాని ప్రకటించడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కామెడీ షోలు చేసే రాకేష్ కు ఒక సినిమా తీసే అంత డబ్బు ఎలా వచ్చింది? సపోర్ట్ గా అతని వెనుక ఎవరైనా ఉన్నారా? లేదా ఏదైనా రాజకీయ పార్టీ ఉందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాకింగ్ రాకేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. తాను ఎవరికీ బినామీ కాదని, KCR సినిమాకి ఎవరూ పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేసారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇల్లు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశానని చెప్పి ఎమోషనల్ అయ్యారు.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా కృష్ణా నగర్ నుంచి బయలుదేరి, ఇప్పుడు మంత్రి చేతుల మీదుగా తన సినిమా పోస్టర్ రిలీజ్ చేయించుకునే స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని రాకింగ్ రాకేశ్ అన్నారు. సినిమా మొదలుపెట్టినప్పుడు ఎవరైతే పక్కన ఉంటామని అన్నారో, ఆ వెధవలే చివరకు తన పక్కన లేకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసాడు. అప్పుడు ఎవరైతే పొగిడారో, వారే ఈరోజు తిట్టడం స్టార్ట్ చేశారని చెప్పారు. కేసీఆర్‌కి తాను పెద్ద ఫ్యాన్ అని, అందుకే సినిమా తీశానని తెలిపారు.
ఏ రాజకీయ నాయకుడికి తాను బినామీని కాదని.. కష్టం, ధైర్యం, ఆత్మ స్థైర్యమే తన బినామీ అని రాకేష్ పేర్కొన్నారు. సినిమా తీయాలంటే డబ్బు మాత్రమే ఉంటే సరిపోదని, చాలా మంది దగ్గర డబ్బులున్నా సినిమా తీయలేకపోతున్నారన్నారు. KCR సినిమా తీయడానికి తన అమ్మ కోసం కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెట్టినట్లు తెలిపారు. తన కారుని కూడా అమ్మేసినట్లు చెప్పారు. డబ్బులు సరిపోకపోతే తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము ఇస్తానని తన భార్య సుజాత ఎంకరేజ్ చేసిందని, అలాంటి భార్య దొరకడం తన అదృష్టమని అన్నారు. టైటిల్ ప్రకటించిన తర్వాత కొంతమంది ఫోన్లు చేసి సినిమా ఆపేయాలని బెదిరించారని రాకేష్ చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.
Also Read: జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి, సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న నటుడు!