మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కల. చిరుకి రెండు మూడు కథలు చెప్పారు. కానీ, సినిమా చేయడం కుదరలేదు. ఇన్నాళ్లకు చిరుతో సినిమా చేసే అవకాశం పూరి జగన్నాథ్‌కు దక్కింది. అయితే... అది దర్శకుడిగా కాదు, నటుడిగా! అవును... చిరంజీవితో పూరి జగన్నాథ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.


చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గాడ్ ఫాదర్'. ఇందులో పూరి జగన్నాథ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పూరి జగన్నాథ్‌కు పుష్ప గుచ్ఛం అందించిన మెగాస్టార్ సెట్స్‌లోకి వెల్కమ్ చెప్పారు.


"వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా! అందుకే, నా పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక పాత్రలో పరిచయం చేస్తున్నాను" అని 'గాడ్ ఫాదర్' సెట్స్‌లో దిగిన ఫొటోను చిరంజీవి ట్వీట్ చేశారు.






'జె జి ఎమ్' (JGM Movie) ఓపెనింగ్‌లో చిరంజీవితో ఎప్పుడు సినిమా చేస్తారు? (దర్శకుడిగా) అనే ప్రశ్న పూరి జగన్నాథ్‌కు ఎదురైంది. అప్పుడు విజయ్ దేవరకొండ ''చిరంజీవితో పూరి జగన్నాథ్ యాక్ట్ చేస్తున్నారు" అని చెప్పారు. అయితే... అది ఏ సినిమా అనేది చెప్పలేదు. 'గాడ్ ఫాదర్' అని ఇప్పుడు తెలిసింది.


Also Read: టాలీవుడ్‌లో విషాదం, సీనియర్ నటుడు బాలయ్య మృతి


కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా నయనతార కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 11న 'గాడ్ ఫాదర్' ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అధికారికంగా విడుదల తేదీ గురించి చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు.


Also Read: చెంపదెబ్బ ఎఫెక్ట్ - విల్ స్మిత్‌పై పదేళ్లు బ్యాన్, నిషేధంలోనూ నిజం ఏంటంటే?