విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో 'మేజర్ చంద్రకాంత్' సినిమా కూడా ఒకటి. అంతేకాదు అన్నగారు నటించిన చివరి సినిమా కూడా ఇదే. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం.
శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించారు. అప్పటికే తెలుగులో సుమారు 300కు పైగా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాని అప్పట్లో భారీ బడ్జెట్ తో తీశారు. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నగారు నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', 'సామ్రాట్ అశోక' వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఈసారి చేయబోయే సినిమా చిరస్థాయిగా నిలిచిపోవాలని అందుకు తగ్గ ఓ కథ రాయమని మోహన్ బాబును అడిగితే మోహన్ బాబు వెంటనే ఈ పవర్ ఫుల్ కథను రెడీ చేశారు.
ఇక వయసు రీత్యా ఈ సినిమాలో అలాంటి పాత్రను ఎన్టీఆర్ చేయగలరా? అని అనుకుంటే ఎన్టీఆర్ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో అద్భుతంగా నటించారు. అంతేకాదు ఎన్టీఆర్ ని మళ్ళీ సీఎం చైర్ పై కూర్చోబెట్టడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అన్నగారు బసవతారకం పేరుతో ఓ ట్రస్ట్ బిల్డింగ్ కట్టడానికి బయట వాళ్లతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని అప్పట్లో మీడియాతో స్వయంగా పంచుకున్నారు. దాంతో మోహన్ బాబు ఆ సినిమా ఏదో నాతోనే చేయండి అని అనడం, అందుకు ఎన్టీఆర్ ఒకే చెప్పడం, వెంటనే ఈ విషయాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు గారికి తెలియజేయడం, ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ ని కథ కోసం పురమాయించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఇక కథ రెడీ అవ్వడంతో ఎన్టీఆర్‌కు వినిపించగా ఆయన ఓకే చెప్పిన తర్వాత 'మేజర్ చంద్రకాంత్' సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన రావడంతో ఇండస్ట్రీలో చాలామంది షాక్ అయ్యారు. మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా, అమ్రిష్ పూరి వంటి నటీనటులు కీరవాణి, గౌతమ్ రాజు, అజయ్ విన్సెంట్, భాస్కర రాజు లాంటి సాంకేతిక నిపుణులతో 1992 నవంబర్ 20న రామకృష్ణ సినీ స్టూడియోలో షూటింగ్ చాలా గ్రాండ్ గా ప్రారంభించారు.
నారా చంద్రబాబు నాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు లక్ష్మి క్లాప్ కొట్టింది. రాజమండ్రి, అరకు లోయ, ఢిల్లీ, కులుమనాలి, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అంతేకాదు చండీగర్ లోని ఆర్మీ జవాన్ల మధ్య కూడా షూటింగ్ చేశారు. ఇక చివరి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వెళుతుంటే చిత్ర యూనిట్ అంతా ఏడ్చేశారు. 1993 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాలో 'పుణ్యభూమి నాదేశం' సాంగ్ లో అల్లూరి, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, గెటప్స్ లో ఎన్టీఆర్ కంపించడంతో అన్నగారి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు తెగ ఆనందించారు. దేశభక్తితో ఎంతో భావోద్వేగంగా సాగే ఈ సినిమా క్లైమాక్స్ లో మేజర్ చంద్రకాంత్ వీరమరణం పొందడంతో ఈ సినిమా ముగియడం ప్రేక్షకులను కదిలించింది. అప్పట్లో ఈ సినిమా చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తిరుపతిలో ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కూడా చేశారు. ఇక కే రాఘవేందర్ రావు ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇది 12వ సినిమా కాగా అటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో కూడా ఇది 12వ సినిమా కావడం విశేషం.