Custody Business : సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సాధించే జయాలు, పరాజయాలు.. వేరే సినిమాల బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'కస్టడీ' విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం.. బిజీగా బిజీగా గడుపుతోంది. అయితే రీసెంట్ గా వచ్చిన సినిమాల పరాజయం 'కస్టడీ' సినిమా బిజినెస్ పై ప్రభావం చూపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'విరూపాక్ష' సినిమా మినహా.. ఏప్రిల్ నెలలో విడుదలైన చాలా మూవీస్ పరాజయం పాలయ్యాయి. అంతకుముందు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన 'థ్యాంక్యూ' సైతం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో ప్రస్తుత కాలం మూవీ బయ్యర్స్ కు కష్ట కాలంగా మారింది. ఆ ప్రభావం నాగ చైతన్య లేటెస్ చిత్రం కస్టడీపైనా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను ఆశించారు. కొన్ని రోజుల ముందు బయ్యర్లు కూడా ఈ మొత్తానికి ఓకే చేశారు. కానీ ఇప్పుడు అంతా రిటర్న్ అయినట్టు తెలుస్తోంది. బయ్యర్లు సినిమాను తక్కువ ధరకు అడుగుతున్నారని, ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.18 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.


హీరో అఖిల్ అక్కినేని నటించి, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న 'ఏజెంట్' చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో.. అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇంతకుముందు క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున నటించిన 'ఘోస్ట్', నాగ చైతన్య 'థ్యాంక్యూ' కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కు ఉత్సాహం, ఉపశమనం కలిగించాలంటే ఓ బలమైన కమర్షియల్ విజయం అవసరమని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో నాగ చైతన్య రాబోయే చిత్రం 'కస్టడీ'పైనే ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా విజయం కేవలం అభిమానులకు ఆనందాన్ని అందించడం కోసమే కాకుండా.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా చాలా ముఖ్యమైనది.


'కస్టడీ'.. మే 12 న థియేటర్లలో విడుదల కానుంది. మొదటిసారి నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్, అరవింద్ స్వామి.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'కస్టడీ' మూవీని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సమకూర్చారు. SR కతిర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' ఇటీవలే రిలీజై.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయింది. థియేటర్లలో విడుదలై వారం రోజులు కాకముందే.. ఓటీటీ విడుదలపైనా మేకర్స్ అప్పుడే అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. 


Also Read : 'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?