Indian Idol : ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' నిర్వహిస్తోన్నతెలుగు 'ఇండియన్ ఐడల్ సీజన్ - 2' ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ కు భారీ రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు రెండో సీజన్ ను కూడా గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఇప్పుడు ఈ సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సంగీతప్రియులను తెగ అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు పాన్ ఇండియా స్టార్ హాజరవనున్నారని ఆహా అధికారికంగా తన అధికారిక ట్వీట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.


దీంతో పాటు ఓ వీడియోను షేర్ చేసిన 'ఆహా'.. ఈ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' గెస్ట్ జడ్జ్ గా హాజరు కానున్నారంటూ వెల్లడించింది. తెలుగు ఇండియన్ ఐడియల్ హ్యాష్ ట్యాగ్ తో పాటు ఐకానిక్ ఫినాలే వచ్చేస్తోందంటూ ప్రకటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్, తమన్, కార్తిక్ లను ట్యాగ్ చేసింది. మొన్నటికిమొన్న ఈ తరహా వీడియోనే పోస్ట్ చేసిన 'ఆహా'.. 'పుష్ప 2' సినిమా టీజర్ ను వీడియో మధ్యలో జత చేసింది. దీంతో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఎవరు అతిథిగా ఎవరు రానున్నారో హింట్ ఇచ్చింది. ఈ సారి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నట్టు ఈ ట్వీట్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా తెలియజేసింది. ఇక తాజా ప్రకటనతో సంగీత ప్రియులతో పాటు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆనందం చేస్తున్నారు. తమ అభిమాన హీరోను 'ఇండియన్ ఐడల్' వేదికపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






ఇక 'ఆహా' పోస్టు చేసిన ఈ వీడియోలో అన్ స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన విజువల్స్ ను జత చేసింది. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న నందమూరి బాలకృష్ణ అప్పట్లో బన్నీ గురించి చెప్పిన డైలాగులు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మరోసారి గుర్తు చేసింది. "బట్ట కట్టాలన్నా, బెల్ట్ పెట్టాలన్నా, జుట్టు దువ్వాలన్నా, చెప్పులెయ్యాలన్నా.. తెలుగు కుర్రకారు ముందు పెట్టుకునే ఫొటో అతనిది.. వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్" అంటూ గ్రేస్ ఫుల్ గా చెప్పిన బాలకృష్ణ డైలాగ్ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఆ తర్వాత బన్నీ సినిమాలోని థీమ్ సాంగ్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా.. అల్లు అర్జున్ కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. ఇక ట్రైలరే ఇలా ఉంటే.. మెయిన్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ హవా ఎలా ఉంటుందోనని అభిమానులు ఈ షోపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.


'ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్ లో నెల్లూరుకు చెందిన గాయని బీవీకే వాగ్దేవీ టైటిల్ ను గెలుచుకున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. ఆమెకు ఫ్రైజ్ మనీతో పాటు రూ.1 లక్ష విలువైన ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరుతో పాటు హీరో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా హాజరై షోలో సందడి చేశారు.


Read Also : ‘సింహాద్రి’ రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ - న్యూ రిలీజ్‌కు కూడా ఇంత రాదేమో!