మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. మార్చి 13న ఆస్కార్ (Oscars 2023) ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ ప్రోగ్రామ్‌కు ఆయన అటెండ్ కానున్నారని సమాచారం. అయితే, అంతే కంటే ముందు మరో అవార్డు కార్యక్రమానికి ఆయన వెళ్ళనున్నారు. అదీ గెస్టుగా కాదు... ప్రజెంటర్ గా!


HCA Awards 2023 వేదికపై చరణ్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది. 


సినిమా, దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో 'ఆర్ఆర్ఆర్' పోటీ పడుతోంది. అవార్డులు ఏయే విభాగాల్లో వస్తాయి? అనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తుంది. అసలు విషయం కాదు... ఆ పురస్కారాల కార్యక్రమంలో వేదికపై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్.సి.ఎ ఆహ్వానించింది. అదీ సంగతి! హెచ్.సి.ఎ అవార్డుల్లోని విజేతలలో ఒకరిని రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఆ ఘనత అందుకున్న తొలి హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. 


Also Read : 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత



అమెరికాలో చరణ్ ఫాలోయింగ్ చూస్తే...
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అవార్డు మన తెలుగు పాటకు రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇంతకు ముందు గోల్డెన్ గ్లోబ్ (golden globe awards 2023 winners) పురస్కారాల్లో కూడా 'నాటు నాటు...' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.


Also Read : గోపీచంద్ 'రామబాణం'లో అసలు కథ దాచేశారా!?


గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్ళారు. అప్పుడు అక్కడి ప్రేక్షకుల నుంచి ఆయనకు విపరీతమైన స్పందన లభించింది. 'ఆర్ఆర్ఆర్'లో ఆయన నటనకు విశేషాల్లోని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులు సైతం అభిమానులు అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ దర్శక - నిర్మాత, 'టైటానిక్' & 'అవతార్' చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడారు. 


రామ్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ : జేమ్స్ కామెరూన్!
దర్శక ధీరుడు రాజమౌళిని ఆ మధ్య జేమ్స్ కామెరూన్ కలిశారు. 'ఆర్ఆర్ఆర్'పై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సమయంలో తన మనసులో మాటను చెప్పాలని అనుకున్నప్పటికీ... చెప్పలేకపోయానని లేటెస్ట్ ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ తెలిపారు. ''ఆర్ఆర్ఆర్ అద్భుతమైన సినిమా. తొలిసారి చూసినప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. షేక్ స్పియర్ క్లాసిక్ తరహాలో అనిపించింది. సినిమాలోని క్యారెక్టర్లు, వీఎఫ్ఎక్స్, కథను చెప్పిన తీరు క్లాసిక్. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ పాత్ర ఛాలెంజింగ్. రామ్ మనసులో ఏముంది? అనేది తెలిసిన తర్వాత షాక్ అయ్యాను. గుండె బద్దలైంది'' అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. 


ఆస్కార్ కూడా చిన్నదే... 
తండ్రిగా గర్విస్తున్నా - చిరు!
రామ్ క్యారెక్టర్ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడటంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన ఆయన మాటల ముందు ఆస్కార్ కూడా చిన్నదేనని చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? అని ఓ తండ్రిగా తాను ఎంతో గర్విస్తున్నానని మెగాస్టార్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.