నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా 'హిట్ 3' మూవీ నుంచి మేకర్స్ టీజర్ తో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్క నిమిషం 44 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో నాని వైల్డ్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన చూపించిన బ్లడ్ బాత్, వైలెన్స్ మామూలుగా లేవు. ఈ సినిమాలో నాని నట విశ్వరూపం చూడబోతున్నామని టీజర్ ద్వారానే అర్థమైంది. అయితే 'హిట్' ఫ్రాంచైజీలో మూడవ భాగంగా రూపొందుతున్న 'హిట్ 3'లో అడివి శేష్ కూడా భాగం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీలో ఆయన పార్ట్ షూటింగ్ ఎంతదాకా వచ్చిన అనే దానిపై అప్డేట్ వచ్చింది.
కృష్ణ దేవ్ తో అర్జున్ సర్కార్ సందడి
కాప్ యూనివర్స్ 'హిట్' ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడవ భాగం తెరకెక్కుతోంది. 2020లోనే 'హిట్' మూవీ రిలీజ్ కాగా, 2022లో అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ 2' తెరపైకి వచ్చింది. ఇందులో అడివి శేష్ కృష్ణ దేవ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. మిస్సింగ్ గర్ల్ చుట్టూ తిరిగే కేస్ తో 'హిట్' కథ తెరకెక్కితే, సీరియల్ కిల్లర్ ను ట్రాప్ చేసే ఆపరేషన్ తో 'హిట్ 2'ను రూపొందించారు. ఇప్పుడు నాని హీరోగా 'హిట్ 3' తెరపైకి రాబోతోంది. ఈ పార్ట్ కు కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, అడివి శేష్ పార్ట్ 3లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అడివి శేష్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమాచారం.
నాని, శేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. శేష్ ఈ కాప్ యూనివర్స్ భాగం కావడం, సెట్లో అడుగు పెట్టడంతో నాని హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. చాలాకాలం నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. కాగా ప్రస్తుతం హైదరాబాద్లో 'హిట్ 3' చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన 'హిట్ 3' టీజర్ కి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాని ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో?
'హిట్ 3'లో కృష్ణదేవ్, అర్జున్ సర్కార్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే అవకాశం ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం 'హిట్' మూవీలో విక్రమ్ రుద్రరాజుగా కనిపించిన విశ్వక్ సేన్, 'హిట్ 2'లో కృష్ణ దేవ్ గా నటించిన అడవి శేష్, 'హిట్ 3'లో అర్జున్ సర్కార్ గా నటిస్తున్న నాని ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ విశ్వక్ సేన్ తప్ప మిగతా ఇద్దరూ హీరోలు ఇప్పుడు ఈ మూవీలో నటిస్తూ ఉండటం విశేషం. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న 'హిట్ 3' మూవీని మే 1న రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: 'ఆయనకు పీపుల్ స్టార్ ట్యాగ్ ఉందని తెలియదు' - ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదన్న హీరో సందీప్ కిషన్