Tension At Ustaad Bhagat Singh Movie Shooting Set: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న అవెయిటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌ సెట్ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతుండగా తెలుగు సినీ కార్మికులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు.

తమకు 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ ప్రతినిధులు స్ట్రైక్ చేస్తుండగా... ముంబై, చెన్నై నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ చేస్తుండడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా... సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో మూవీ టీంతో వాగ్వాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు.

మైత్రీ మూవీ మేకర్స్, పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం

ఓ వైపు తెలుగు సినీ కార్మికులు బంద్ చేస్తుంటే... ముంబై, చెన్నై నుంచి కార్మికులను తెచ్చి షూటింగ్ చేయడం ఏంటి? అంటూ యూనియన్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, చిత్ర నిర్మాతలు, పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై చర్చలు జరిపి న్యాయం చేయకుంటా ఇలా చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకోవాలనుకుంటే... ఆయన సినిమాకే ఇలా చేయడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలుగు సినీ కార్మికుల కష్టం పవన్‌కు తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ పూర్తి చేయగా... మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేయాలని టీం భావిస్తోంది. ఇంతలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో చెన్నై, ముంబై నుంచి కార్మికులను తెచ్చి అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు అక్కడకు వెళ్లి టీంతో వాగ్వాదానికి దిగారు.

Also Read: నా జుట్టు ఊడిపోయింది... నాగ్ ఇంకా యంగ్‌గానే ఉన్నారు - కింగ్‌పై తలైవా రజినీకాంత్ ప్రశంసలు

ఇదీ అసలు డిమాండ్

సినీ కార్మికుల వేతనాలు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం పెంచాలని ఒప్పందం జరగ్గా... ఇటీవలే దాని గడువు ముగిసింది. దీనిపై టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్, ఫిలిం చాంబర్ మధ్య గతంలోనూ పలుమార్లు చర్చలు జరిగాయి. అన్నీ విఫలం కావడంతో 30 శాతం వేతనాలు పెంచి ఇచ్చిన వారి షూటింగ్స్‌కే అటెండ్ కావాలంటూ ఫెడరేషన్ తీర్మానించింది. దీంతో సోమవారం షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువే...

ఈ క్రమంలో ఉదయం ఫిలిం చాంబర్‌లో సినీ నిర్మాతల మండలి యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ మీటింగ్‌కు అల్లు అరవింద్, మైత్రీ రవి, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్ హాజరయ్యారు. మరోవైపు... సినీ కార్మికులకు బయట ఉన్న వారి కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని... సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే వీరికే జీతాలు ఎక్కువని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా... కొంతమంది నిర్మాతలు తమ సినిమాలకు పని చేసే కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచేందుకు అంగీకరిస్తూ ఫిలిం ఫెడరేషన్‌కు లెటర్స్ ఇచ్చారు.