హీరో విక్రమ్‌కు ప్రమాదం జరిగింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తంగళన్’ మూవీ షూటింగ్‌లో ఆయన ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడ్డారని, దీంతో ఆయన పక్కటెముకులు విరిగాయని తెలిసింది. ప్రమాదం వార్త తెలియగానే షూటింగ్ సిబ్బంది హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విక్రమ్ ఇటీవలే ‘పొన్నియెన్ సెల్వన్’ మూవీ సీరిస్‌తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఆయన కొద్ది రోజుల కిందటే తిరిగి షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఇంతలోనే ఇలా జరగడంతో చియాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 


‘తంగలన్’ మూవీ కోసం శ్రమిస్తున్నవిక్రమ్


'తంగలన్' మూవీ కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారియారు. విక్రమ్ గతంలో ఏ చిత్రంలోనూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఊరమాస్ గెటప్‌లో డస్టీ లుక్‌లో ఉన్న విక్రమ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2023 మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘తంగలన్’ క్రేజ్ దక్కించుకుంది. స్పెషల్ కంటెంట్ తో ఆకట్టుకోబోతున్నారు. హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పా రంజిత్ వెల్లడించారు. విక్రమ్‌కు ఇది 61వ చిత్రం. 


విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే 'తంగలన్' సినిమాకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.  వీడియోలో ప్రధానంగా విక్రమ్ పాత్రను హైలెట్ చేసింది. విక్రమ్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న విజువల్స్ ను అద్భుతంగా చూపించారు. ‘తంగలన్‌’లోని  పాత్రకు తగినట్లుగా విక్రమ్ తన బాడీని మలుచుకున్నారు. భారీగా బరువును తగ్గడంతో పాటు తన మజిల్స్ లో బలాన్ని తగ్గించుకున్నారు.    


స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందింది. అయితే, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగలన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అటు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అదిత కరికాలన్ పాత్రను పోషిస్తున్నారు. 


‘పొన్నియన్ సెల్వన్’ హిట్‌తో ఫ్యాన్స్ సంబరాలు


విక్రమ్ కీలక పాత్రలో నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ సీరిస్‌లు హిట్ కొట్టడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ‘పొన్నియన్ సెల్వన్-1’ కంటే ఎక్కువ క్రేజ్ ‘పొన్నియన్ సెల్వన్-2’కు లభించడం విశేషం. ఈ క్రేజ్‌కు ఓటీటీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఓటీటీలో రిలీజైన్ ‘పొన్నియన్ సెల్వన్-1’.. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. దీంతో ‘పొన్నియన్ సెల్వన్-2’ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అయితే, తమిళనాడులో మాత్రమే ఈ మూవీకి ఎక్కువ క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యావరేజ్‌గా నిలించింది. ‘ఏజెంట్’ ఫ్లాప్ ఈ మూవీకి పెద్దగా కలిశారాలేదు. ఎందుకంటే.. ప్రేక్షుకులు ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ‘విరూపాక్ష’ మూవీకి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.


Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!