Actor Siddharth on Revanth Reddy: నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. రిపోర్టర్లు ప్రశ్నలు అడిగే సమయంలో ఓ విలేకరి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ లాంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హీరోలు, నటీనటులు కూడా బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. అలా చేసిన హీరోల సినిమాలకు తాము ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తామని రేవంత్ చెప్పారు.
దీనిపై స్పందించాలని విలేకరి భారతీయుడు 2 టీమ్‌ను అడగ్గా.. సిద్ధార్థ్ స్పందించారు. తాను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని అన్నారు. ‘‘తెలుగు సినిమాలో తొలిసారిగా నేనే కండోమ్ చేతిలో పట్టుకొని దీన్ని వాడాలని ప్రభుత్వం తరపున ప్రచారం చేశాను. అప్పట్లో నేను నా ముఖంతో స్వయంగా కండోమ్ పట్టుకొని ప్రచారం కల్పించిన ఫోటోలు అన్ని రకాల ఫ్లెక్సీలపై ఉండేవి. సురక్షిత లైంగిక సంబంధాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నేను 2005 నుంచి 2011 వరకూ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం సురక్షిత లైంగికతపై అవగాహన కోసం ఎక్కడ బిల్ బోర్డ్స్ ఉన్నా.. దానిపై కండోమ్ పట్టుకున్న నేనే ఉండేవాడిని. ఎందుకంటే అది నా బాధ్యత.
ఒక చీఫ్ మినిస్టర్ చెప్తే ఆ బాధ్యత నాకు రాదు. ఒక యాక్టర్‌కు ముందు నుంచి ఇలాంటి బాధ్యత ఉందా అంటే నేను నో కామెంట్స్ అని చెప్తాను. ప్రతి నటుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. మా పరిధిలో ఉన్న మేరకు మేం ప్రభుత్వాలకి సాయం చేస్తాం. సీఎంలు ఏం అడిగినా చేయడానికి మేం రెడీనే. నువ్వు ఇలా చేస్తేనే మేం ఆ సహకారం అందిస్తాం.. అని సీఎం చెప్పడం కరెక్టు కాదు’’ అని సిద్ధార్థ్ సమాధానం ఇచ్చారు.
విలేకరి ఈ ప్రశ్న అడిగినప్పుడు వేదికపై కమల్ హాసన్, డైరెక్టర్ ఎన్ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వారి తరపున సిద్ధార్థ్ సమాధానం చెప్పారు.