కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా పరిచయమైన రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2017లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. దాదాపు ఆరేళ్ళు బ్రేక్ తీసుకున్న మనోజ్.. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌ ఎక్కారు. ‘వాట్‌ ది ఫిష్‌’ అనే మూవీ చేస్తున్నారు. అయితే మంచువారబ్బాయ్ అంతకంటే ముందుగా హోస్ట్ అవతారమెత్తి, బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. 


ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌ వేదికగా ప్రసారం కాబోతున్న ఓ టాక్‌ షోకి మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కొంచం కొత్తగా, సరికొత్తగా రాబోతున్నానని ఊరిస్తూ వచ్చిన మనోజ్.. తన డిజిటల్ ఎంట్రీ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ''ప్రియమైన అభిమానుల కోసం, తిరిగొస్తున్నా కొంచం కొత్తగా, సరికొత్తగా ర్యాంప్ ఆడించడానికి మీ రాకింగ్ స్టార్ ఒక గేమ్ షోతో తిరిగి వచ్చాడు'' అని ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా 'హి ఈజ్ బ్యాక్' అంటూ దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.


''నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచి సినిమాపై పెంచుకున్న ప్రేమ నా ప్రొఫెషన్‌ గా మారింది. నన్ను ఒక నటుడిగానూ, హీరోగానూ చేసింది. రాకింగ్‌ స్టార్‌ అనే ఒక పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌, అరుపులు, కేకలు.. ఇలా పండగలా జరిగిన నా లైఫ్ లోకి సడన్ గా ఓ సైలెన్స్‌ వచ్చింది. మనోజ్‌ అయిపోయాడు అన్నారు. కెరీర్‌ ఖతం అన్నారు. యాక్టింగ్‌ ఆపేశాడు ఇక తిరిగి రాడు అన్నారు. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గింది అన్నారు. విన్నాను.. చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను..'' అంటూ మంచు మనోజ్‌ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.






Also Read: కుర్రాడిగా మారేందుకు నానా పాట్లు - జగ్గూ భాయ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?


మంచు మనోజ్ లుక్ ని రివీల్ చేయకుండా, తన ఇంటెన్స్ వాయిస్‌ ఓవర్ తో ఈ ప్రోమో ద్వారా ఓటీటీ ఎంట్రీ గురించి వినిపించారు. కొంతకాలంగా సినిమాలకు  దూరంగా ఉండటం వల్ల తన కెరీర్ గురించి వచ్చిన రూమర్స్ ను ప్రస్తావించడం, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వనున్నట్లు సింబాలిక్ గా చెప్పడం ఆకట్టుకుంటోంది. దీన్ని ఒక టాక్ షో ప్రోమో మాదిరిగా కాకుండా, మూవీ టీజర్ లా కట్ చేయడం ఈ కార్యక్రమంపై ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది. 


మంచు మనోజ్ టాక్ షోకి శరత్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసింగ్ చేస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. వెన్నెల కిశోర్ 'అలా మొదలైంది' తర్వాత  పీపుల్స్ మీడియా వారు ఈటీవీ విన్ ఓటీటీ కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. త్వరలోనే ఈ రాకింగ్ షోకి సంబంధించిన ఇతర వివరాలు, స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 


టాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుబాటి, నాని, నవదీప్ వంటి పలువురు హీరోలు హోస్టులుగా కొన్ని షోలు చేసారు. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా 'ఫ్యామిలీ ధమాకా' గేమ్ షోతో విశ్వక్ సేన్ కూడా వ్యాఖ్యాతగా మారాడు. ఈ క్రమంలో ఇప్పుడు మంచు మనోజ్ కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటి వరకూ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న రాకింగ్ స్టార్.. వ్యాఖ్యాతగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో, ర్యాంప్ ఆడిస్తాడో లేదో వేచి చూడాలి.


Also Read: జూనియర్ ‘గంధర్వుడు’గా జనతా గ్యారేజ్ యాక్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial