ప్రతీ శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు శుక్రవారం తర్వాత వరుసగా వచ్చే సెలవులు సినిమాల రిజల్ట్స్‌ను డిసైడ్ చేస్తాయి. గత శుక్రవారం కూడా అలాగే లాంగ్ వీకెండ్ రావడంతో అప్పుడే విడుదలయిన సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టడానికి మంచి అవకాశం లభించింది. కానీ ఈ సమయంలో రెండు సినిమాలు మాత్రం కలెక్షన్స్‌ను పూర్తిగా డామినేట్ చేసేశాయి. అవే రజినీకాంత్ నటించిన ‘జైలర్’, సన్నీ డియోల్ హీరోగా వచ్చిన ‘గదర్ 2’. మిగతా సినిమాలు కూడా కలెక్షన్స్ విషయంలో పరవాలేదనిపించినా.. ముఖ్యంగా ఈ రెండు చిత్రాలు మాత్రం ఎక్కువగా కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ లాంగ్ వీకెండ్ వల్ల ఏయే సినిమాలు ఎంత లాభం పొందాయో చూద్దాం..


భోళా శంకర్..
ప్రస్తుతం బాక్సాఫీస్ పోటీలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అవే ‘గదర్ 2’, ‘జైలర్’, ‘భోళా శంకర్’, ‘ఓఎమ్‌జీ 2’. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’.. ‘జైలర్’కు సౌత్‌లో పోటీ ఇవ్వడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికే చిరు రీమేక్స్‌తో ఫ్యాన్స్ నిరాశగా ఉండడం, మెహర్ రమేశ్ లాంటి ఫ్లాప్ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించడంతో ముందు నుండే ‘భోళా శంకర్’పై పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. అందుకే విడుదలయిన వారం రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.28.95 కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది. మొదటిరోజు రూ.16.25 కలెక్షన్స్ సాధించినా రెండోరోజు నుండే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. ఇక గురువారం రోజు ‘భోళా శంకర్’ రూ.25 లక్షలు కలెక్ట్ చేసినట్టు సమాచారం.


ఓఎమ్‌జీ 2..
అనేక కాంట్రవర్సీల మధ్య విడుదలయ్యింది అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎమ్‌జీ 2’. అడల్ట్ సినిమా అంటూ సెన్సార్ సెర్టిఫికెట్ ఇవ్వడంతో ఈ మూవీపై ఫ్యామిలీ ఆడియన్స్‌లో నెగిటివ్ ఏర్పడింది. కానీ కేవలం మౌత్ టాక్‌తోనే ‘ఓఎమ్‌జీ 2’ హిట్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.84.72 కోట్లను కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొదటిరోజే ‘ఓఎమ్‌జీ 2’ రూ.10.26 కోట్లను కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రోజే ఒక్కసారిగా దీని కలెక్షన్స్ 49.12 శాతం పెరిగాయి. ఆదివారం ఒక్కరోజు కాస్త వెనకబడినట్టు అనిపించినా.. మళ్లీ పుంజుకుంది. ఇక గురువారం రోజు ‘ఓఎమ్‌జీ 2’ రూ.5.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.


జైలర్..
భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలయ్యింది ‘జైలర్’. మామూలుగానే రజినీకాంత్ సినిమా అంటే హడావిడి మామూలుగా ఉండదు. అలాగే ‘జైలర్’ ముందు కూడా ఆ హడావిడి కనిపించింది. మొదటినుండి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ అయిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ‘జైలర్’కు రూ.235.65 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ డే ఏకంగా రూ.48.35 కోట్ల కలెక్షన్స్ సాధించింది. లాంగ్ వీకెండ్ మొత్తం ఎక్కడా తగ్గకుండా సత్తాచాటాడు ‘జైలర్’. ఇక గురువారం ఈ మూవీకి రూ.10 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.


గదర్ 2..
ఎక్కువగా ప్రమోషన్స్ లేకుండా విడుదలయిన హిందీ చిత్రం ‘గదర్ 2’. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ఇతర భారీ చిత్రాలతో ‘గదర్ 2’ ఇప్పటికీ పోటీపడుతోంది. విడుదలయిన వారం రోజులకే ఈ మూవీ రూ.283.35 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు కలెక్షన్స్‌ను మెయింటేయిన్ చేస్తూ వస్తోంది ‘గదర్ 2’. మొదటిరోజే ఏకంగా రూ.40.1 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇక గురువారం ‘గదర్ 2’ కలెక్షన్స్ రూ.22 కోట్లుగా తేలింది.


Also Read: ‘సలార్’ టీమ్ విజువల్ ట్రీట్ - ఆ ఫార్మాట్‌లో మూవీ రిలీజ్‌కు సన్నహాలు, ఫ్యాన్స్‌కు పండగే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial