GOAT Movie Song: ఈరోజుల్లో టెక్నాలజీ సాయంతో ముఖ్యంగా ఏఐతో ఏదైనా చేసేయొచ్చు. ఏఐ అనేది కేవలం మొహాలను మార్చడానికి మాత్రమే కాదు.. వాయిస్‌ను మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే సినీ పరిశ్రమలో కూడా ఏఐ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (G.O.A.T) సినిమాలో కూడా అదే జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటలో చనిపోయిన ఇళయరాజా కూతురు భవతారిణి వాయిస్‌ను ఏఐతో క్రియేట్ చేశారు మేకర్స్. ఇది ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తోంది.


ఏఐ వాయిస్..


వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రమే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. జూన్ 22న విజయ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ‘చిన్న చిన్న కంగళ్’ అనే పాట విడుదలయ్యింది. ఈ పాటను విజయ్‌తో పాటు భవతారిణి ఆలపించారని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరణించిన భవతారిణి ఈ పాట పాడడమేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోగా.. ఇది ఏఐతో క్రియేట్ చేసిన వాయిస్ అని అర్థమయ్యింది. దీంతో భవతారిణి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ పాట ప్రోమోను విజయ్‌తో సహా మూవీ టీమ్ అంతా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాట చాలామందిని ఆకట్టుకుంటోంది.






క్యాన్సర్ కారణంగా..


ఈ పాట మా మనసులకు చాలా దగ్గరయ్యింది అంటూ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. ‘చిన్న చిన్న కంగళ్’ అంటూ సాగే ఈ పాటకు ఏఐ సాయంతో భవతారిణి వాయిస్‌ను రీక్రియేట్ చేయడంతో పాటు మరో స్పెషాలిటీ కూడా ఉంది. దీనిని స్వయంగా హీరో విజయ్ పాడారు. దీంతో ఈ సాంగ్ తమకు కూడా చాలా స్పెషల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇళయరాజా వారసురాలిగా మ్యూజిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు భవతారిణి. మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా తండ్రికి తగిన కూతురు అనిపించుకున్నారు. కానీ క్యాన్సర్ కారణంగా ఈ ఏడాది జనవరిలో తను కన్నుమూశారు.


రెండు పాటలు..


‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే ఈ మూవీ నుండి ‘విజిల్ పొడు’ అనే పాట విడుదలయ్యింది. ఈ పాట లిరికల్ వీడియోలో విజయ్‌తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్‌లు కూడా సందడి చేశారు. ఈ పాటను కూడా విజయే పాడడం విశేషం. మామూలుగా విజయ్.. తాను నటించిన సినిమాల్లోని మొదటి పాటను తానే పాడుతూ ఉంటారు. కానీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లో మాత్రం ఆయన రెండు పాటలు పాడారు. ఈ మూవీలో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటిస్తుండగా.. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ కృష్ణ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Also Read: దళపతి విజయ్‌ను స్టార్ చేసిన తెలుగు రీమేక్ చిత్రాలు ఇవే, ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 సినిమాలు!