హీరోయిన్ అనుష్క శెట్టి ముద్దుపేరు ఏంటో తెలుసు కదా? స్వీటీ! రియల్ లైఫ్‌లో ఆవిడ పర్సనాలిటీ కూడా చాలా స్వీట్ అని సినిమా ఇండస్ట్రీ జనాలు చెప్పే మాట. జేజమ్మ, దేవసేన వంటి పవర్ ఫుల్ రోల్స్ చేసినప్పటికీ... ఆమెను వయలెంట్ రోల్‌లో చూపించిన క్రెడిట్ మాత్రం క్రిష్ జాగర్లమూడికి దక్కుతుంది. 'ఘాటి' ప్రచార చిత్రాలలో అనుష్క కొత్తగా కనిపించారు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని చూసే అభిమానులు కొంత మంది ఉన్నారు. వాళ్లకు ఒక అప్డేట్... జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట!
జూలై రెండవ వారంలో అనుష్క 'ఘాటి'?
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. 'వేదం' సినిమాలో ఆవిడ వేశ్య పాత్ర చేశారు. ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా క్రిష్ ఆ పాత్రను చూపించిన విధానం బావుందని ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ప్రసంశించారు. అయితే... ఇప్పుడు క్రిష్ రూటు మార్చారు. 'ఘాటి' సినిమాలో కసిగా పీకలు కోసే పాత్రలో అనుష్క చూపించబోతున్నారు.
ఏప్రిల్ 18న 'ఘాటి' విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే... అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని అనుకోవడం వల్ల డిలే అయిందని టాక్. ఇప్పుడు ఈ సినిమాను జూలై రెండో వారంలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట.
జూన్‌లో రిలీజ్ డేట్స్ ఖాళీ లేవు. మొదటివారం కమల్ హాసన్ 'థగ్ లైఫ్', రెండో వారం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', మూడో వారం ధనుష్ - నాగార్జునల 'కుబేర', నాలుగో వారం విష్ణు మంచు 'కన్నప్ప' సినిమాలు ఉన్నాయి. జూలై మొదటి వారంలో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' విడుదలకు రెడీ అయింది. ప్రస్తుతానికి జూలై రెండవ వరం స్లాట్ ఖాళీగా ఉంది. అందుకని అప్పుడు విడుదల చేయాలని ప్లాన్ చేశారట. జూలై రెండవ వారం అయితే ఘాటీకి సోలో రిలీస్ దక్కే అవకాశం ఉంది. అది సంగతి.
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన 'ఘాటీ'లో తమిళ హీరో విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటివరకు అనుష్కను ఎవరు చూడనటువంటి వయలెంట్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులు చూస్తారని యూనిట్ చెబుతోంది.
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు తగ్గించారు. ఆచి తూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విజయం సాధించినప్పటికీ... ఆ తర్వాత వెంట వెంటనే సినిమాలు అంగీకరించలేదు. తనకు నచ్చిన కథలకు మాత్రమే ఆవిడ ఓటు వేస్తూ వస్తున్నారు. హరిహర వీరమల్లు ఆలస్యం కావడంతో ఆ సినిమా బాధ్యతలను పక్కనపెట్టి ఈ సినిమా ప్రారంభించారు క్రిష్ జాగర్లమూడి. 'వేదం' తర్వాత అనుష్కతో ఆయన ఎటువంటి సినిమా తీశారని ఆసక్తి అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ ప్రముఖులలో కూడా ఉంది.