పాత రోజుల్లో సినిమాలు చూడటానికి గ్రామాల నుంచి జనాలు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు కట్టుకొని పట్నంలోని థియేటర్లకు తరలి వచ్చేవారు. కాలంతో పాటుగా అవన్నీ మారిపోయాయి. ప్రస్తుత ఓటీటీల జమానాలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ఫిలిం మేకర్స్ కు పెద్ద సవాలుగా మారిపోయింది. అయితే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నాటి సీన్ మళ్లీ రిపీట్ అయింది. ‘గదర్ 2’ సినిమాని థియేటర్లలో చూసేందుకు అభిమానులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో రావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా తర్వాత ఈ తరహా పరిస్థితిని బాలకృష్ణ 'అఖండ' థియేటర్ల దగ్గర తెలుగు జనాలు చూశారు.


బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ (Sunny Deol) నటించిన తాజా చిత్రం ‘గదర్ 2’ (Gadar 2 Movie). ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్టు 11న విడుదలైంది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. చాలా రోజుల తర్వాత నార్త్ లో థియేటర్లు జనాలతో కళకళలాడిపోతున్నాయి. ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో వస్తున్నారు. సాధారణంగా కార్లు బైకులతో నిండిపోయే పార్కింగ్ ప్లేస్.. వ్యవసాయ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. దీనికి సంబందించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 






ఇటీవల కాలంలో హిందీ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. సౌత్ చిత్రాలకు, ఓటీటీలకు అలవాటు పడిపోయిన నార్త్ ఆడియన్స్... బాలీవుడ్ సినిమాలను థియేటర్లలలో చూడటం తగ్గించేశారు. అందుకే 'పఠాన్' లాంటి ఒకటీ రెండు చిత్రాలు మాత్రమే థియేట్రికల్ రెవెన్యూ రాబట్టగలిగాయి. ఇప్పుడు 'గదర్ 2' మూవీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఉత్తరాదిలో ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. 


సినిమా చూడటానికి బండ్లు కట్టుకొని థియేటర్లకు వస్తున్నారంటే 'గదర్ 2' క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ప్రస్తావిస్తూ.. "2001లో సన్నీడియోల్ 'గదర్‌' మూవీ చూడటానికి ట్రక్కులు, ట్రాక్టర్లలో జనాలు సినిమా హాళ్లకు వచ్చారని నేను కథలు కథలుగా విన్నాను. 22 ఏళ్ళ తర్వాత అదే క్రేజ్ ను ఇప్పుడు 'గదర్ 2' కి చూస్తున్నాం'' అని ట్వీట్ పెట్టాడు. థియేటర్ల వద్ద పార్కింగ్ కోసం ట్రాక్టర్లు, ట్రక్కులు నిలబడి ఉన్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 






2001లో వచ్చిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రానికి సీక్వెల్ గా 'గదర్ 2' రూపొందింది. ఇందులో సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధం, యాక్షన్‌, దేశభక్తి, ప్రేమ అన్నీ కలబోసి దర్శకుడు అనిల్ శర్మ ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కించారు. ఈ చిత్రం ఓపెనింగ్ డే రూ. 40 కోట్లకు పైగా వసూలు చేసి నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెకండ్ డే 43.08 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా రెండు రోజుల్లోనే 83.18 కోట్లు సాధించి, 2023లో రెండో బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. మూడో రోజు 100 కోట్ల మార్క్ ని క్రాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.


Also Read: Sridevi's 60th Birthday: శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న బోనీ కపూర్, ఖుషీ కపూర్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial