కొందరు స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ విషయంలో మాత్రం రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆ రికార్డులు ఏ స్థాయిలో నమోదు అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే షారుఖ్ ఖాన్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’తో ఇలాంటి ఎన్నో రికార్డులను తిరగరాయడానికి వచ్చేస్తున్నాడు. ‘జవాన్’ రిలీజ్‌కు ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉండడంతో నార్త్ రాష్ట్రాల్లో అప్పుడే సందడి మొదలయిపోయింది. కానీ ఈ మూవీ రిలీజ్‌కు ఒక పెద్ద ఇబ్బంది కలగనుంది. అదే జీ 20 సమావేశం. జీ 20 సమ్మిట్ కారణంగా ఢిల్లీలో ఏర్పాటు చేసే నియమ, నిబంధనల వల్ల ‘జవాన్’పై ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్..
తమిళ దర్శకుడు అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ చేసిన చిత్రమే ‘జవాన్’. మామూలుగా షారుఖ్ సినిమా అంటే ముందు నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే ఎన్నో ఫ్లాపులను ఎదుర్కున్న తర్వాత ఈ ఏడాది ‘పఠాన్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు షారుఖ్. కలెక్షన్స్ పరంగా చాలాకాలం తర్వాత షారుఖ్‌కు ఊరటనిచ్చింది ఈ సినిమా. ఇక ఇదే ఏడాదిలో మరో హిట్ కొట్టి తాను ఇంకా సీనియర్ హీరోల రేసులో ఉన్నానని నిరూపించుకోవాలని ఈ హీరో పంతంతో ఉన్నారు.  అందుకే ‘జవాన్’ చిత్రాన్ని తానే స్వయంగా తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా నిర్మించడంతో పాటు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకున్నాడు.


రోజుకు 17 నుంచి 18 షోలు..
సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా థియేటర్లలో ‘జవాన్’ సందడి చేయనుంది. ఢిల్లీలోని చాలా థియేటర్లలో బెనిఫిట్ షోకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఇప్పటికే ‘జవాన్’ తన దూకుడును చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దాదాపు 4 లక్షలకు పైగా టికెట్లు ప్రీ బుక్ అయ్యాయని తెలుస్తోంది. ఇక నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో రోజుకు 17 నుంచి 18 షోలు వేయాలని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ‘జవాన్’ లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. దీంతో పాటు ప్రీ రిలీజ్ హడావిడి చూస్తుంటే సినిమా కచ్చితంగా ఓ రేంజ్‌లో హిట్ అవుతుందని అనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో జీ 20 సమ్మిట్ ద్వారా ‘జవాన్’కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఆ ఆంక్షలే అడ్డు..
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీ జీ 20 సమ్మిట్ జరగనుంది. అందుకే సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో పలు ఆంక్షలను విధించనున్నారు. ఆ రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు.. ఇలా అన్నీ ఈ రెండురోజుల పాటు మూతపడనున్నాయి. మూడురోజులు వరుసగా సెలవులు ఉంటే సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడం వరకు నిజమే.. కానీ ఇందులో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. జి 20 సమ్మిట్ కారణంగా మూడురోజుల పాటు పలు రోడ్లను మూసివేయనున్నారు. మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేయనున్నారు. ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు, రైళ్ల నిలిపివేత మధ్య ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారా అన్నదే అసలు సమస్య. ఒకవైపు సెలవుల వల్ల ‘జవాన్’కు మంచే జరిగినా.. ఆంక్షలు అనేవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి.


Also Read: నేషనల్ అవార్డ్స్ వివాదం - నాని సోషల్ మీడియా పోస్ట్‌పై రానా వ్యాఖ్యలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial