అభిమానులను, సినీ కార్మికులను రక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ముందడుగు వేశారు. స్టార్ క్యాన్సర్ సెంటర్ తో కలిసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. "సుమారు 80% క్యాన్సర్లను ముందుగా గుర్తిస్తే, ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జూలై 9న హైదరాబాదులో, జూలై 16న వైజాగ్ లో, జూలై 23న కరీంనగర్లో రోజుకు 1000 మంది చొప్పున వివిధ క్యాన్సర్లకు సంబంధించిన టెస్టులను నిర్వహించనున్నట్లు చిరంజీవి వెల్లడించారు. సినీ కార్మికులతో పాటు అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాదు ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు విషయంలోనూ తాను కొంత భరిస్తానని అన్నారు చిరంజీవి. అయితే అది ఎంత మొత్తం అనేది ఇప్పుడే చెప్పలేమని, మరొకసారి వైద్యులతో మాట్లాడి చెబుతానని అన్నారు. సినీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కూడా ఇస్తామని, దాని ద్వారా భవిష్యత్తులోనూ వాళ్లు ఉచితంగా చికిత్సలు చేయించుకోవచ్చని అన్నారు.


స్టార్ ఆసుపత్రి డైరెక్టర్ మన్నే గోపీచంద్ వైద్యులు సాయి, బిపిన్ తో కలిసి ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రణాళికలను వెల్లడించారు చిరంజీవి. క్యాన్సర్ బారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అవగాహన కల్పించేలా సినీ పరిశ్రమ తరపున ప్రత్యేక లఘు చిత్రాలు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. ఇక చిరంజీవి విజ్ఞప్తి మేరకు క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా వచ్చే నాలుగు నెలల పాటు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు స్టార్ క్యాన్సర్ డైరెక్టర్ మన్నె గోపీచంద్ తెలియజేశారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సహృదయంతో ముందుకు వచ్చిన చిరంజీవికి తోడుగా తమ వంతు సహకారాన్ని అందించనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా క్యాన్సర్ తీరుని బట్టి చికిత్సలో రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు.


కాగా కొద్ది రోజుల క్రితమే ఉచిత క్యాన్సర్ పరీక్షలపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తాను క్యాన్సర్ బారిన పడకుండా ముందుగానే కొలనోస్కోపీ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నట్లు తెలిపారు. ఇక చిరంజీవి చేపట్టిన ఈ మహత్తర కార్యం పట్ల సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళాశంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో వచ్చిన అజిత్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' కి ఇది అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకి చెల్లెలిగా కనిపించనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: పవన్ 'OG'పై అర్జున్ దాస్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ - వైరల్ గా మారిన ట్వీట్స్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial