Tamannaah As Shiva Shakthi In Odela 2: సంపత్‌ నంది, హెబ్బాపటేల్‌ కాంబోలో సూపర్ హిట్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’. ఆగష్టు 26, 2022లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను చిత్రబృందం వారణాసిలో మొదలు పెట్టారు.


శివశక్తిగా తమన్నా- ఆకట్టుకుంటున్న‘ఓదెల 2’  ఫస్ట్ లుక్


ఇక మహా శివరాత్రి సందర్భంగా ‘ఓదెల 2’ మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ: శివాయ” అంటూ మిల్కీ బ్యూటీ స్పెషల్‌ లుక్‌ ను షేర్ చేశారు. తమన్నా లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు గ్లామరస్, స్టైలిష్ పాత్రలు పోషించిన తమన్నా, ఈసారి శివశక్తిగా మారిపోయింది. ఈ చిత్రంలో తమన్నా శివుడి భక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ఓదెల-2’ కోసం తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నట్లు తెలిపారు. పెద్ద జుట్టుతో నాగ సాధువులా కనిపిస్తోంది. ఒక చేతిలో సాధువు కర్ర, మరో చేతిలో ఢమరుకం పట్టుకుని శివశక్తిలా దర్శనమిస్తోంది. కాశీ ఘాట్ లపై నడుస్తూ దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తోంది. తమన్నా పోస్టర్ ను చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏ పాత్రలోనైనా తమన్నా ఇట్టే ఒదిగిపోతుందంటున్నారు.






‘ఓదెల 2’ కథ ఏంటంటే?


ఇక ‘ఓదెల 2’లో సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన ఊరిని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తారనేది చూపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓదెల రైల్వేస్టేషన్ లో ప్రధాన పాత్ర పోషించిన హెబ్బా పటేల్.. ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించనుంది. వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కాంతార’ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.


ఇప్పటి వరకు గ్లామరస్‌, పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ‘ఓదెల 2’లో సరికొత్తగా అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచుతోంది. 2023లో ‘లస్ట్ స్టోరీస్’, ‘జీ కర్దా’ లాంటి వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది. తమిళంలో ‘జైలర్’, తెలుగులో ‘భోళా శంకర్’ సినిమాల్లో తమన్నా నటించింది. ప్రస్తుతం ఆమె ‘ఓదెల-2’తో పాటు మరో రెండు సీక్వెల్స్ చేస్తోంది. కోలీవుడ్ లో సుందర్ సి దర్శకత్వంలో ‘అరణ్మణై 4’, బాలీవుడ్ లో ‘స్త్రీ 2’లో నటిస్తోంది. మొత్తంగా వరుస సినిమాలతో తమన్నా మంచి జోష్ లో కొనసాగుతోంది.


Read Also: నేను హీరోయిన్ కావడం శ్రీదేవికి ఇష్టం లేదు, రజనీకాంత్ సినిమాలు తిరస్కరించా: సుహాసిని