February Releases: టాలీవుడ్‌లో 2024 మొదలయినప్పటి నుండి సినిమాల విడుదల తేదీలపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ప్రతీ సినిమాకు లాభం రావాలని.. విడుదల తేదీల వల్ల ఏ సినిమా నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సైతం జోక్యం చేసుకొని సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తోంది. అందుకే ఫిబ్రవరీలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ పోస్ట్‌పోన్ అవుతూనే ఉన్నాయి. దాదాపు అరడజనకు పైగా సినిమాలు.. ముందు చెప్పిన విడుదల తేదీని క్యాన్సల్ చేసుకొని.. కొత్త విడుదల తేదీలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరీలో చిన్న సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదని అర్థమవుతోంది.


‘ఈగల్’తో గొడవ మొదలు..


ముందుగా ఫిబ్రవరీ 9 గురించి సినిమాలు అన్నీ పోటీపడుతున్నాయి. కానీ అది ఫైనల్‌గా మాస్ మహారాజ్ రవితేజ చేతికి వెళ్లింది. ఆయన హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ రిలీజ్ కోసం ఫిబ్రవరీ 9 రిజర్వ్ అయ్యింది. దీంతో అదే తేదీని రిలీజ్ డేట్‌గా ప్రకటించిన సినిమాలన్నీ పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



మనసు మార్చుకున్న ‘టిల్లు స్క్వేర్’..


ఫిబ్రవరీ 9న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన క్రేజీ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ విడుదల అవుతున్నట్టుగా ప్రకటించింది. కానీ ఉన్నట్టుండి చాలా సినిమాలు పోటీకి వచ్చాయి. దీంతో వేరే దారి లేక ఏకంగా మార్చి 29కు రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారు ‘టిల్లు స్క్వేర్’ మేకర్స్. తాజాగా మార్చి 29 రిలీజ్ డేట్‌తో కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.



అదే బాటలో ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘భీమా’..


వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరీలోనే విడుదల అవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఫిబ్రవరీ 9న డేట్ ఖాళీ లేకపోవడంతో ఒక వారం ఆలస్యంగా రావాలనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరీ 16న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు.. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫిబ్రవరీ 23 లేదా మార్చి 1న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూటునే ఫాలో అవుతున్న గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ కూడా ఫిబ్రవరీ 16 నుండి మార్చి 8కు పోస్ట్‌పోన్ అయ్యింది.



ముందుగా ఎఫెక్ట్ అయిన ‘ఊరు పేరు భైరవకోన’..


ఇక ‘ఈగల్’ కోసం విడుదల తేదీని త్యాగం చేసిన సినిమాల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’. సంక్రాంతి రేసులో నిలబడాల్సిన ఈ మూవీ.. ఫిబ్రవరీ 9న విడుదల అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ ‘ఈగల్’ కారణంగా ఫిబ్రవరీ 16కు ఈ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. 



మధ్యలో ‘లాల్ సలామ్’..


విడుదల తేదీలు పోస్ట్‌పోన్ అవుతూ.. ఆలస్యం అవుతున్నా కూడా సినిమాలపై బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. ఇక ఇన్ని తెలుగు సినిమాల మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించిన ‘లాల్ సలామ్’ కూడా యాడ్ అయ్యింది. అసలైతే ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోటీని దృష్టిలో పెట్టుకొని పక్కకు తప్పుకుంది. ఇప్పుడు ఫిబ్రవరీలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది ‘లాల్ సలామ్’.



Also Read: భార్య సీమంతం - సంతోషంగా ఫోటో షేర్ చేసిన నిఖిల్