Fascinating Facts About King Nagarjuna: ఆయన సైకిల్ చైన్ కోపంగా తీస్తే ఓ సెన్సేషన్... స్టైల్‌గా ఓ చూపు చూస్తే అటెన్షన్. అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ అమ్మాయిల మనసులు దోచే మన్మథుడు. సిల్వర్ స్క్రీన్ ఎవర్ గ్రీన్ గ్రీకు వీరుడు. 60 ఏళ్లు దాటినా టాలీవుడ్ హీరోలకు సమానంగా లుక్స్, తన నటనతో మెప్పించే యంగెస్ట్ 'కింగ్' నాగార్జున.
ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నప్పటికీ 'నాగార్జున'ది ఓ ప్రత్యేక స్థానం. డివోషనల్, మాస్, క్లాస్, విలన్... ఇలా రోల్ ఏదైనా 4 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. శుక్రవారం ఆయన 66వ పుట్టిన రోజు సందర్భంగా 'మన్మథుడు' గురించి కొన్ని విశేషాలు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా...
నాగార్జున ఫస్ట్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1961లో వచ్చిన 'వెలుగు నీడలు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించారు. ఆ తర్వాత ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సుడిగుండాలు (1967)లో నటించారు. 1986లో 'విక్రమ్' మూవీతో ఆయన ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశారు.
అందులో మాస్టర్స్ డిగ్రీ
అక్కినేని నాగార్జున అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఇండస్ట్రీలో అతి తక్కువ మంది అధునాతన సాంకేతిక విద్యను అభ్యసించే పరిశ్రమలో ఇది అరుదైన విజయం.
ధాతృత్వం... జంతు సంక్షేమం...
నాగార్జున కరుణ, ధాతృత్వం అంతకు మించి ఉంది. జంతు సంక్షేమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తన భార్య అమల అక్కినేనితో కలిసి, ఆయన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్‌ను స్థాపించారు. ఈ సంస్థ జంతు సంరక్షణలో విశేష కృషి చేస్తోంది. గాయపడిన జంతువుల సంరక్షణ, పునరావాసం కోసమే అంకితమైన ప్రభుత్వేతర సంస్థ.
Also Read: మళ్లీ మెగా ఫోన్ పట్టనున్న ఎస్వీ కృష్ణారెడ్డి - సౌత్ కొరియా హీరోయిన్‌తో డ్రీమ్ ప్రాజెక్ట్ 'వేదవ్యాస్'
ఏజ్... జస్ట్ నెంబర్ అంతే
6 పదులు దాటినా ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోరు మన కింగ్ నాగార్జున. ఇండస్ట్రీలో మన్మథుడు అంటేనే ఠక్కున గుర్తొచ్చే పేరు నాగార్జున. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనేలా కుర్ర హీరోలకు దీటుగా కనిపిస్తారు నాగ్. తన డైట్, ఫిట్ నెస్‌తో ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ నవ మన్మథుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన డైలీ రొటీన్‌లో భాగంగా వ్యాయామం, హెల్దీ ఫుడ్, డిసిప్లిన్‌తో కూడిన జీవన శైలిని అనుసరిస్తుంటారు. 35 ఏళ్లకు పైబడి నాగ్ ఇదే పాటిస్తున్నారు.
బుల్లి తెరపై ఫస్ట్ టైం బిగ్ స్టార్
టాలీవుడ్‌లో బుల్లితెరపై ఫస్ట్ టైం అడుగుపెట్టిన బిగ్ స్టార్ మన కింగ్ నాగార్జున. 2014 - 15లో 'స్టార్ మా'లో వచ్చిన ఫేమస్ క్విజ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కు హోస్ట్‌గా వ్యవహరించారు. విజ్ఞానంతో పాటు ఎంతోమంది సామాన్యులు ఈ షో ద్వారా లక్షాధికారులుగా మారారు. తమ ప్రతిభతో నగదుతో పాటు అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఎన్నో సీజన్లు కొనసాగిన ఈ షో ఎవర్ గ్రీన్‌గా నిలిచింది.
ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తూ హౌస్‌ను ముందుండి నడిపించారు. ఇక లేటెస్ట్ సీజన్‌లోనూ ఆయనే హోస్ట్‌గా రాబోతున్నారు. ఈ షో టీవీ రంగంలోనే మోస్ట్ ఎంటర్‌టైనింగ్, రియాలిటీ షోగా నిలిచింది.
డిఫరెంట్ రోల్స్...
పాత్ర ఏదైనా తనదైన నటనతో ఒదిగిపోతారు నాగార్జున. యాక్షన్, రొమాంటిక్, డివోషనల్, ఎమోషన్ ఇలా ఏ రోల్ అయినా గూస్ బంప్స్ తెప్పించారు. తెలుగు సినిమాను మార్చిన యాక్షన్-ప్యాక్డ్ శివ (1989) నుంచి రొమాంటిక్ గీతాంజలి (1989), డివోషనల్ అన్నమయ్య (1997) వరకు... ఆయన నటనకు ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. కోలీవుడ్, బాలీవుడ్ మూవీస్‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా తమిళ చిత్రం కూలీలో 'సైమన్' అనే విలన్ రోల్ ఆయనకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.
జపాన్‌లో నాగ్-సామ
జపాన్‌లో అక్కినేని నాగార్జున బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అక్కడి ఫ్యాన్స్ ఆయన్ను గౌరవంగా 'నాగ్-సామ' అని పిలుస్తారు. జపనీస్ భాషలో, "సామ" అంటే గొప్ప గౌరవాన్ని చూపించడానికి ఉపయోగించే ప్రత్యేక శీర్షిక. ఈ మారు పేరు జపనీస్ అభిమానులు ఆయన్ను ఎంతగా ఆరాధిస్తారో తెలియజేస్తుంది. ముఖ్యంగా జపనీస్ ప్రేక్షకులు 'బ్రహ్మాస్త్ర', 'శివ' వంటి మూవీస్ ఎక్కువగా ఇష్టపడతారు.
కొత్త దర్శకులు... నాగ్ మార్గదర్శకులు
తెలుగు సినిమా భవిష్యత్తును రూపొందించడంలో నాగార్జున సైలెంట్‌గా కీలక పాత్ర పోషించారు. దాదాపు 40 మంది కొత్త దర్శకులు ఆయన మూవీస్ ద్వారా పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కింద న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ఆయన తన 100వ చిత్రాన్ని ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన సుదీర్ఘ కెరీర్, సినిమా పట్ల ఆయనకున్న ఇష్టాన్ని హైలెట్ చేస్తోంది.