Fahadh Faasil Wants To Becoming A Cab Driver: డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన నటనతో టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఫహాద్ ఫాజిల్. భాష ఏదైన తనదైన శైలిలో డైలాగ్స్, యాక్టింగ్‌తో మెప్పించారు. పుష్ప, పుష్ప 2 మూవీస్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో మెప్పించి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేశారు. తాజాగా కామెడీ థ్రిల్లర్ 'మారీశన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వడివేలు కీలక పాత్ర పోషించారు.
క్యాబ్ డ్రైవర్ అవుతా...
శుక్రవారం 'మారీశన్' రిలీజ్ కాగా... తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఫహాద్. తనకు క్యాబ్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని... సినిమాలు చేయడం పూర్తైతే ఆ పని చేసుకుంటానని అన్నారు. 'మేము కొన్ని నెలల క్రితం బార్సిలోనా వెళ్లాం. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అది. ఆడియన్స్ నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి 'ఇక చాల్లే చూడలేకపోతున్నాం..' అనుకున్న రోజున నేను మూవీస్ మానేస్తాను. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్లి సెటిల్ అవుతాను.
అక్కడ క్యాబ్ డ్రైవింగ్ చేస్తా. ప్రజలను ఓ చోటి నుంచి మరో చోటుకి తీసుకెళ్తాను. ఆ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదో ఫన్నీగా చెప్పడం లేదు. ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే మంచి విషయం ఏముంటుంది. డ్రైవింగ్ నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే నేను సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత స్పెయిన్‌లోని బార్సిలోనా వెళ్లి అక్కడ ఉబర్ డ్రైవర్‌గా వర్క్ చేస్తాను.' అని ఫహాద్ స్పష్టం చేశారు.
Also Read: షూటింగ్ సెట్స్‌లోకి మక్కల్ సెల్వన్ - సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన పూరీ జగన్నాథ్ టీం
అయితే, గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో ఫహాద్ ఇదే విషయాన్ని చెప్పారు. తన భార్య నజ్రియాకు ఇదే విషయాన్ని చెప్పానని... ఆమె కూడా సంతోషంగా ఒప్పుకొన్నట్లు తెలిపారు. క్యాబ్ డ్రైవింగ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 'సినిమాలు కాకుండా నాకు ఏ పని ఇష్టమంటే కచ్చితంగా క్యాబ్ డ్రైవింగ్ అని చెప్తా. ఉబర్ డ్రైవర్‌గా ఉండడం కన్నా నాకు సంతృప్తి, ఆనందం ఇచ్చే పని మరొకటి ఉండదు. బార్సీలోనా వెళ్లి స్పెయిన్ మొత్తం తిరుగుతూ ప్రజలను తిప్పుతుంటాను.' అంటూ గత ఇంటర్వ్యూల్లో చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే... ఫహాద్ లేటెస్ట్ మూవీ 'మారీశన్'కు సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. వడివేలు కీలక రోల్ పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ డ్రామా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీపై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. 'కైయేతుం దూరత్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫహాద్ తమిళ, తెలుగు, హిందీ మూవీస్‌లో నటించి మెప్పించారు. పుష్ప, పుష్ప 2 మూవీస్ టాలీవుడ్‌లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.