సింగర్ నోయెల్, నటి ఎస్తేర్ గురించి మీకు తెలిసిందే. వాళ్లు విడాకులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా.. మీడియా మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ మరోసారి తన మాజీ భర్త నోయెల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.


గోవాలో సెటిల్ అయిన ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఎస్తెర్.. చాలా చిన్న వయసు నుండే మ్యూజిక్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఎనిమిదేళ్ల వయసు నుండే కొంకనీలో పాటలు పాడుతూ ఉండేది. ఇక 2012లో ‘బరోమాస్’ అనే హిందీ చిత్రంతో యాక్టింగ్‌లో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన నటనను చూసి ఇంప్రెస్ అయిన తేజ.. తాను తెరకెక్కించిన ‘1000 అబద్ధాలు’ అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎస్తెర్‌కు ఛాన్స్ ఇచ్చి టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా.. పలువురు మేకర్స్ మాత్రం ఎస్తెర్ టాలెంట్‌ను గుర్తించి తనకు తెలుగులో ఛాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. తెలుగు, హిందీతో పాటు కన్నడలో కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది ఎస్తెర్. అదే సమయంలో తనకు మ్యూజిక్‌పై ఉన్న ఇష్టం ద్వారా నోయెల్‌తో పరిచయమయ్యి పెళ్లి కూడా చేసుకుంది.


6 నెలల్లో 16 రోజులు మాత్రమే


2019లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తెర్, నోయెల్.. 2020లోనే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా విడాకుల సమయంలో కేవలం 16 రోజులు మాత్రమే కలిసున్నామంటూ వీరు చేసిన ప్రకటన.. మరింత వైరల్‌గా మారింది. తాజాగా 16 రోజులు కలిసున్న విషయంపై ఎస్తెర్ క్లారిటీ ఇచ్చింది. జనవరిలో పెళ్లయితే.. జూన్‌లో విడాకులకు అప్లై చేశామని గుర్తుచేసింది ఎస్తెర్. అయితే ఈ 6 నెలలలో వారు కలిసున్న రోజులు కేవలం 16 మాత్రమే అని బయటపెట్టింది. ఎప్పటికప్పుడు ఎవరి కమిట్‌మెంట్స్‌తో వారు బిజీగా ఉండడంతో తను, నోయెల్ కలిసుండడానికి ఎక్కువగా సమయం కుదిరేది కాదని తెలిపింది. 


బిగ్ బాస్‌లో నోయెల్ చేసిన వ్యాఖ్యలపై స్పందన


నోయెల్.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించాడు. అప్పటివరకు నోయెల్ ఒక ర్యాపర్‌గా, సింగర్‌గా మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. ఇక బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం కొంచెంగా బయటపెట్టాడు. ఎస్తెర్‌పై కూడా పలు కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్‌పై కూడా ఎస్తెర్ తాజాగా స్పందించింది. తను తెలుగులో సినిమా ఛాన్సులు లేకపోవడంతో గోవాలో తన కుటుంబం దగ్గరకు వెళ్లిపోయానని, ఆ సమయంలో బిగ్ బాస్ అనే షో జరిగిందని అందులో నోయెల్ తనపై కామెంట్స్ చేసిన విషయం కూడా తనకు తెలియదని చెప్పింది. ఎస్తెర్ తన కుటుంబం నుండి తనను విడదీయాలని చూసిందని నోయెల్ ఒక సందర్భంలో అన్నాడు. దానిపై ఎస్తెర్ స్పందిస్తూ.. అతను ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి కాబట్టి, ఇక్కడే బతకడం కోసం ఎన్ని అసత్యాలు చెప్పుకున్నా తనకు సంబంధం లేదని ఈ మ్యాటర్‌ను కొట్టిపారేసింది.


ప్రస్తుతం నోయెల్‌తో తాను టచ్‌లో ఉందా అని అడగగా.. టచ్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది అంటూ స్పందించింది ఎస్తెర్. తాము ముందు ఫ్రెండ్స్‌గా కలవలేదని, కేవలం పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే దగ్గరయ్యామని చెప్పుకొచ్చింది. పెళ్లి అనేదే వర్కవుట్ అవ్వనప్పుడు ఇంక మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించింది. నోయెల్ తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడని, అందుకే మళ్లీ తనతో మాట్లాడే ఆలోచనే లేదంటూ తేల్చేసింది ఎస్తెర్. విడాకుల తర్వాత తనకు వచ్చిన నెగిటివిటీ కంటే సపోర్ట్ ఎక్కువగా ఉందంటూ తన తెలుగు అభిమానులకు ధన్యవాదాలు చెప్పింది.


Also Read: టాలీవుడ్‌లోకి ‘చిరుత’ బ్యూటీ - ఆ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న నేహా శర్మ