బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'(Emergency). ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ నుంచే బాలీవుడ్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఈ మూవీలో కంగనా అప్పటి మన దేశ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన కంగనా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ ని అందుకోగా.. మూవీ యూనిట్ ఈరోజు 'ఎమర్జెన్సీ' అఫీషియల్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ని కట్ చేశారు. ఈ మేరకు హీరోయిన్ కంగనా రనౌత్ తన ట్విట్టర్ ద్వారా ఈ టీజర్ ని పంచుకుంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఒక్కసారిగా సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.


దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975 తేదీతో టీజర్ మొదలవుతుంది. ప్రతిపక్షాలు అరెస్ట్, మీడియా ప్రసారాలు ఆగిపోయాయి, ప్రజలు వీధుల్లోకి వచ్చారు, పోలీసులు అణిచివేత విధానాన్ని అవలంబిస్తున్నారు, బుల్లెట్లు కాల్చారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ.. ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా అనే శక్తివంతమైన స్వరం వినిపిస్తుంది. ఇలా ఎంతో ఆసక్తిగా సాగిన ఈ టీజర్ పై కంగనా ఓ ఆసక్తికర క్యాప్షన్ రాసుకొచ్చింది. 'రక్షకుడా లేక నియంత?. మన దేశ లీడర్ తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన రోజు చరిత్రలోనే చీకటి రోజు' అంటూ పేర్కొంది. ఇక ఈ సినిమా నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. నిజానికి ముందు అక్టోబర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల నవంబర్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ ఏడాది బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ఎమర్జెన్సీ' కూడా ఒకటి. కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. రితేష్ షా ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.


మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి తో కలిసి కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ కేర్, శ్రేయస్ తల్పడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కంగనా పలు ఆసక్తికర పోస్టులు చేసింది. ఈ మేరకు సినిమా గురించి గురించి మాట్లాడుతూ.. "యువ భారతదేశం తెలుసుకోవాల్సిన మన చరిత్రలో 'ఎమర్జెన్సీ' చాలా ముఖ్యమైన మరియు చీకటి అధ్యాయాలలో ఒకటి. ఇది చాలా కీలకమైన కథ. ఈ సినిమాలో భాగమైన దివంగత నటుడు సతీష్ కౌశిక్, అనుపమ్ కేర్, శ్రేయాస్, మహిమ, మిలింగ్ లాంటి టాలెంటెడ్ నటులకు ధన్యవాదాలు. మన భారతదేశ చరిత్ర నుండి ఇలాంటి ఓ అసాధారణ ఎపిసోడ్ను బిగ్ స్క్రీన్ పై తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. జైహింద్" అంటూ రాసుకొచ్చింది కంగనా రనౌత్. మరి కంగనా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి నటించిన ఈ 'ఎమర్జెన్సీ' ఆడియన్స్ ని ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.