Razakar Trailer Launch Event: తెలంగాణ చరిత్ర గురించి తెలియని ప్రేక్షకుల కోసం ‘రజాకార్’ అనే సినిమాతో వస్తున్నాడు దర్శకుడు యాటా సత్యనారాయణ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ డైరెక్టర్.. తెలంగాణ చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డానని తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అసలు తన కెరీర్ ఎక్కడ, ఎలా ప్రారంభమయ్యిందో.. అందులో రాఘవేంద్ర రావు పాత్ర ఎంత ఉందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ‘రజాకార్’ సినిమా తెరకెక్కించడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు.
రాజమౌళితో పాటే..
‘‘నేను నిలబడిన ఈ ప్లేస్‌లో నాకు అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే గుడిసెలు ఉండేవి. అప్పుడే రాఘవేంద్ర రావుగారు చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. రాజమౌళి, వర్మ.. ఇలా చాలామంది డైరెక్టర్స్ ఒకేసారి 7,8 ప్రాజెక్ట్స్ చేసేవాళ్లం. మాకు ఒక గుడిసె ఉండేది. అక్కడే తింటూ, కథలు మాట్లాడుకుంటూ, మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పటికీ మా వాట్సాప్ గ్రూప్‌కు డీపీగా ఆ గుడిసె ఉంటుంది. నేను జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న రోజుల్లో రాఘవేంద్ర రావుగారంటే నాకు పిచ్చి. ఆ తర్వాతే ఏడాదిలోనే ఆయన దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. ఆయన దగ్గర చేరిన మూడో నెలలోనే నన్ను టీవీలో డైరెక్టర్‌ను చేశారు. నేను, రాజమౌళి ఒకేసారి సీరియల్స్‌కు డైరెక్టర్స్‌గా పనిచేశాం. అప్పట్లో తెలంగాణ పిల్లోడు, ఎవడ్రా ఈ నల్లోడు అని అంటుండేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్ర కాదు.. టాలెంట్ ఉంటే చాలని రాఘవేంద్ర రావుగారు గుర్తించారు’’ అని యాట సత్యనారాయణ కెరీర్ మొదట్లో ఎంత కష్టపడ్డారో చెప్పుకొచ్చాడు.
నీకేంటి నొప్పి.?
‘‘పూర్వీకులను, చరిత్రను, మూలాలను, అస్థిత్వాన్ని గుర్తుంచుకోవడం మా రక్తంలోనే ఉంది. గుర్తుంచుకున్నాం కాబట్టే రజాకార్ బయటికొచ్చింది. రజాకార్ వల్ల కొన్ని మెసేజ్‌లు వచ్చాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి, వీడియోల కింద కామెంట్స్ వస్తాయి. ఎవడిని ఉద్దరించడానికి రజాకార్ చేస్తున్నారని ఒకడంటాడు. నీకేంటి నొప్పి? రామయణాన్ని వినిపించినా కూడా ఇంతే కదా అనుకునేవారికి మా నొప్పి తెలియాలని, అలాంటివి మీకు జరగకుండా జాగ్రత్తపడాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ గడ్డ మీదే పుట్టాం, పెరిగాం, తిన్నాం. ఈ గడ్డ కోసం పోరాటం చేసినవారిని మర్చిపోదామా? ఏం చెప్తున్నార్రా ఇడియట్స్? ఇలాంటి సినిమాలు కచ్చితంగా తీస్తాం. నాకు స్వాతంత్య్రం వచ్చింది సెప్టెంబర్ 17 అని చెప్పుకోవాల్సిన కర్మ ఈరోజు ఎందుకు వచ్చింది. ఎందుకు చరిత్ర తొక్కబడింది? మీరు తొక్కేశారు కాబట్టే. తొక్కిన చోటే ఉద్యమం ముందుకొస్తుంది, పోరాటం మొదలవుతుంది. మేము చేసిన పోరాటం చూపించడమే రజాకార్’’ అంటూ తన సినిమాపై విమర్శలు కురిపిస్తున్న వారిపై ఫైర్ అయ్యాడు యాట సత్యనారాయణ.
వాళ్లకే భజన చేస్తారా..
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవారికోసమే ఈ సినిమా. ఒక మతం గురించి మాట్లాడితే అందులో ఉన్న ధనికుడు మాత్రమే ఎందుకు గొప్పగా కనిపిస్తున్నాడు? ఒక పేదవాడు ఎందుకు కనిపించడం లేదు? ఆరోజు పల్లెటూళ్లలో ఉన్న మీనమ్మ కూడా రేప్ చేయబడింది. అప్పుడు ఏం పీకారు? మతంలో ఉన్న పేదవారిని పట్టించుకోరా? బలిసినోళ్లనే పట్టించుకుంటారా? వాళ్లకే భజన చేస్తారా? చరిత్ర తెలుసుకోండి. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే నా సినిమాకు రేటింగ్ ఇవ్వొద్దు. చరిత్రను రేటింగ్‌తో కొలవొద్దు. నా తరువాతి సినిమాకు జీరో రేటింగ్ ఇవ్వండి నేను ఒప్పుకుంటా. చాలామంది నన్ను అంటరాని వాడిలాగా చూస్తున్నారు. రజాకార్ అంటే ఎంత నీచుడో, ఎంత అన్యాయం జరిగిందో తెలియడానికే మీ ముందుకు వస్తున్నాం తప్పా ఎవరినీ ఉద్దేశించింది కాదు’’ అని ‘రజాకార్’పై క్లారిటీ ఇచ్చారు యాట సత్యనారాయణ.
Also Read: రకుల్ పెళ్లికి సర్వం సిద్ధం - వెడ్డింగ్ కార్డ్ వైరల్