Vassishta about Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 156వ చిత్రంగా తెరకెక్కుతోంది ‘విశ్వంభర’. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతుందని ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ చూస్తే క్లారిటీ వచ్చింది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సంక్రాంతికి ‘విశ్వంభర’ నుండి టైటిల్, గ్లింప్స్ విడుదలయిన తర్వాత ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ గురించి, చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వశిష్ట.


బాధ్యత, ఒత్తిడి.. రెండూ ఉన్నాయి..
ముందుగా ‘విశ్వంభర’లో చిరంజీవి లుక్స్ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ప్రజెంట్ చేస్తానని వశిష్ట మాటిచ్చాడు. ఈ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి ప్రీక్వెల్, సీక్వెల్ అని వార్తలు వస్తున్నా అవేమీ నిజాలు కాదని క్లారిటీ ఇచ్చాడు. తనలాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని చిరంజీవి నమ్మడంపై వశిష్ట స్పందించాడు. ‘‘పెద్ద స్టార్ ఒక్క సినిమా చేసిన దర్శకుడిని నమ్మి కథకు ఓకే చెప్పారంటే అది చాలా బాధ్యతను పెంచుతుంది. అలాగే ఒత్తిడి కూడా ఉంటుంది. నమ్మినప్పుడు ఎలా చూపించాలి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్లడానికి చిరంజీవి బాగా సపోర్ట్ చేశారు. ఆయన నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. నేను అనుకుంటుంది ధైర్యంగా ఆయనకు చెప్పగలను. ఆయన నచ్చితే ఓకే అంటారు. లేకపోతే ఆలోచించు ఒకసారి అంటారు’’ అని చిరంజీవితో పెరిగిన చనువు గురించి చెప్పుకొచ్చాడు వశిష్ట.


చిన్నపిల్లాడు అయిపోయి కథ వింటారు..
‘విశ్వంభర’ మూవీ అనేది టాప్ 3లో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా వశిష్ట బయటపెట్టాడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లాగా ‘విశ్వంభర’ గురించి చెప్పుకుంటారని నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ మూవీ కోసం డిస్నీ సినిమాల్లో ఉన్నట్టుగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని రివీల్ చేశాడు. చిరంజీవిని మొదటిసారి కలిసి, కథ వినిపించిన అనుభవాన్ని కూడా వశిష్ట గుర్తుచేసుకున్నాడు. ‘‘బయట నుంచి చూసినవారికి చిరంజీవి గారా? అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్లిన తర్వాత ఆయన చాలా కంఫర్ట్ ఇస్తారు. చిన్నపిల్లాడు అయిపోయి కథ వింటారు. కథ విని.. ఏది ఎలా ఉందో చెప్పేస్తారు. అందులో పెద్దగా కన్‌ఫ్యూజ్ చేయడంలాంటివి ఏమీ ఉండవు. కథ చెప్పడానికి వెళ్లినప్పుడు నువ్వు కథ చెప్పడానికి వచ్చింది మెగాస్టార్ చిరంజీవికి అని మర్చిపో. ఒక ప్రేక్షకుడిగా ఫ్రెండ్‌కు కథ ఎలా చెప్తావో చెప్పు. ఫ్రీగా ఉండు. అనిపించింది చెప్తాను. నచ్చితే మార్పులు చేయి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పు. చివర్లో అది నీ నిర్ణయమే. చాలా స్వేచ్ఛ ఇచ్చారు. అలా ఎప్పుడు వెళ్లినా గంట, రెండు గంటలు ఆయనతో గడిపేవాడిని’’ అన్నాడు వశిష్ట.


వాళ్లంతా నా బ్యాచ్‌మేట్స్..
మెగా ఫ్యామిలీ తనకు ముందు నుండే తెలుసని బయటపెట్టాడు వశిష్ట. ‘‘అల్లు శిరీష్, రామ్ చరణ్, రానా, నేను బ్యాచ్‌మేట్స్. అలా నేను చిరంజీవి ఇంటికి వెళ్లేవాడిని. శంకర్ దాదా ఎమ్‌బీబీఎస్‌కు కొన్నిరోజులు పనిచేశాను’’ అని చెప్పాడు. ‘బింబిసార’ మూవీ తనను దర్శకుడిగా ప్రూవ్ చేసిందని సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని ‘బింబిసార’ మార్చేసిందని అన్నాడు. ఇక చిరంజీవితో కలిసి వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.






Also Read: ఫిల్మ్‌ఫేర్ 2023 నామినేషన్స్ - 19 కేటగిరిల్లో ‘యానిమల్’ పోటీ, ఇదిగో జాబితా