ఓటీటీల పరిధి రోజు రోజుకు మరింత విస్తృతం అవుతున్న నేపథ్యంలో, సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు ప్రముఖ దర్శకుడు తేజ. తాజాగా ‘రామబాణం’ ప్రమోషన్ లో భాగంగా గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేసిన ఆయన, సినిమాలు చచ్చిపోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చారు.


థియేటర్లలో చూసేదే సినిమా- తేజ


సినిమాలను థియేటర్లలో చూస్తేనే పూర్తి అనుభూతి పొందగలుగుతామని తేజ చెప్పారు. టీవీల్లో, సెల్ ఫోన్లలో చూస్తూ పూర్తి స్థాయిలో సినిమాను ఆస్వాదించలేమన్నారు. ‘అవతార్’ లాంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందన్నారు. సింగిల్ స్క్రీన్స్ లో పెద్ద స్ర్కీన్స్ ఉన్న థియేటర్లకు వెళ్లి సినిమాలను చూడాలని చెప్పారు.  అక్కడ చూసిన సినిమాలే మంచి అనుభూతిని కలిగిస్తాయన్నారు. తాను కూడా ప్రతి వీకెండ్ థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తానని చెప్పుకొచ్చారు. థియేటర్లలో చూసేదే సినిమా అన్నారు. అందుకే తన ఇంట్లో ఇప్పటికీ హోం థియేటర్ పెట్టుకోలేదన్నారు.


సినిమాను చంపేది అదొక్కటే!


సినిమాను ఓటీటీలు, సెల్ ఫోన్లు చంపలేవని తేజ తెలిపారు.  అయితే, సినిమా థియేటర్లకు వెళ్లినప్పుడు ఆడియెన్స్ నుంచి తనకు పాప్ కార్న్ ధరల గురించి పెద్ద కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. “మల్టీఫ్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ రేట్లు భయంకరంగా ఉంటున్నాయి. కోక్ రేట్ విపరీతంగా ఉంటుంది. వాటిని కొనడం తమవల్ల కావడం లేదంటున్నారు.  మధ్య తరగతి ప్రజలు ఆ రేట్లు పెట్టి కొనుగోలు చేయలేకపోతున్నారు. మల్టీ ఫ్లెక్స్ లో ఉన్న పాప్ కార్న్ అమ్మే వారి మూలంగానే సినిమా చనిపోతుంది. చాలా మంది  పాప్ కార్న్, సమోసా తింటూ, కోక్ తాగుతూ సినిమా చూస్తారు.  వీటి రేట్లు పెరిగితే సినిమాకు వెల్లడం మానేస్తారు. బాంబేలో హిందీ సినిమాలు చచ్చిపోవడానికి కారణం ఆడియెన్స్ కాదు. మల్టీ ఫ్లెక్స్ లలో అమ్మే పాప్ కార్న్ రేటే చంపేసింది. తెలుగులో ఎక్కువ సింగిల్ స్ర్కీన్ లు ఉండటం వల్ల చంపలేకపోతున్నాయి. అందుకే ప్రేక్షకులు సింగిల్ స్ర్కీన్స్ కు వెళ్లండి. అక్కడ సినిమా పెద్ద గా కనిపిస్తుంది. చాలా మల్టీ ఫ్లెక్స్ లలో చిన్న స్ర్కీన్స్ ఉంటాయి. మల్టీ ఫ్లెక్స్ లు ఎక్కువైన ఏరియాలో సినిమా చచ్చిపోతుంది. కారణం పాప్ కార్న్ ధరలు. ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేవు. కేవలం పాప్ కార్న్ సినిమాను చంపగలదు” అని తేజ అభిప్రాయపడ్డారు.


Also Read : సురేందర్ రెడ్డి to కొరటాల, పూరి, గుణశేఖర్... క్రియేటివ్ డైరెక్టర్స్ సినిమా నిర్మాణంలో వేళ్ళు పెట్టడం ఆపేయాలా?






గోపీచంద్ హీరోగా, డింపుల్  హయతి హీరోయిన్ గా నటించిన  'రామబాణం' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  శ్రీవాస్ దర్శకత్వం వహించిన ‘రామబాణం’ చిత్రంలో జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.


Read Also: ప్రోమో దుమ్మురేపినా, అసలు మ్యాటర్ ఔట్, తేజ-గోపీచంద్ ఇంటర్వ్యూలో వాటికి సమాధానాలు ఏవి?