Director Selva Raghavan About 7G Rainbow Colony Sequel: '7/G బృందావన్ కాలనీ' (7/G Brindavan Colony) .. ఈ మూవీ పేరు వింటేనే మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ గుర్తొస్తుంది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన '7/జీ రెయిన్ బో కాలనీ' చిత్రాన్ని తెలుగులో '7/G బృందావన్ కాలనీ' పేరుతో విడుదల చేశారు.

సీక్వెల్ షూట్ 50 శాతం పూర్తి

దర్శకుడు సెల్వ రాఘవన్ '7/జీ రెయిన్ బో కాలనీ' మూవీని తెరకెక్కించగా 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు సెల్వరాఘవన్ అప్ డేట్ ఇచ్చారు.

సీక్వెల్ మూవీ షూటింగ్ 50 శాతం పూర్తైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫస్ట్ పార్ట్ ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందేనని.. ఈ సీక్వెల్ సైతం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అన్నారు. 

Also Read: నేషనల్ క్రష్ రష్మికకు బర్త్‌డే విషెష్ - 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' వచ్చేసింది!

సీక్వెల్ స్టోరీ ఏంటంటే?

'7/G బృందావన్ కాలనీ' మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని.. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మనసుని హత్తుకునే స్టోరీతో పార్ట్ 2 సిద్ధం చేస్తున్నట్లు దర్శకుడు సెల్వ రాఘవన్ తెలిపారు. 'సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే సగం పూర్తైంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో హీరోకు జాబ్ రావడం.. ఒంటరిగా మిగిలిపోవడం వరకు మాత్రమే చూపించాం. ఆ తర్వాత పదేళ్లు అతని జీవితం ఎలా సాగిందనే అంశాలతో సీక్వెల్ రూపొందిస్తున్నాం. అసలు సీక్వెల్‌లో ఏం జరుగుతుందనేది పార్ట్ 1లోనే క్లూ ఇచ్చాం. ప్రస్తుతం ఈ సినిమాను చిన్న చిత్రంగా విడుదల చేయడం సాధ్యం కాదు.' అని వెల్లడించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నట్లు చెప్పారు.

7/G బృందావన్ కాలనీ స్టోరీ ఏంటంటే?

అదో అందమైన కాలనీ. కాలనీలో ఓ యువకుడు తన తల్లి, తండ్రి, చెల్లెలితో కలిసి ఉంటాడు. జులాయిగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఓ లక్ష్యం లేకుండా ఉంటాడు. దీంతో అతని తండ్రి ఎప్పుడూ కొడుతుంటాడు. ఇదే సమయంలో ఆ కాలనీలోకి ఓ యువతి కుటుంబం వస్తుంది. ముందు ఆ యువతితో గొడవ పడినా ఆ తర్వాత ఆమె అంటే ఈ యువకుడు ఇష్టపడతాడు. ఇదే సమయంలో ఆ యువతి కూడా ఇతన్ని ఇష్టపడుతుంది.

జాబ్ లేకుండా ఉన్న అతన్ని మంచి పొజిషన్‌లో చూడాలని అనుకుంటుంది. ఇదే సమయంలో అతని టాలెంట్స్ తెలుసుకుని జాబ్ వచ్చేలా చేస్తుంది. వీరి విషయం ఇంట్లో తెలిసి యువతి ఇంట్లో గొడవ మొదలవుతుంది. దీంతో ఇద్దరూ బయటకు వెళ్లగా.. ఓ యాక్సిడెంట్‌లో సదరు యువతి చనిపోతుంది. ఆమె తనతోనే ఉందనే భ్రమలో యువకుడు జీవితాన్ని కొనసాగిస్తాడు. దీనికి సీక్వెల్ త్వరలోనే రాబోతోంది.

యుగానికి ఒక్కడు సీక్వెల్ కూడా..

మరోవైపు, ఇదే ఇంటర్వ్యూలో 'యుగానికి ఒక్కడు' సీక్వెల్‌పైనా దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడారు. 'ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఆశగా ఉంది. ముందే అనౌన్స్ చేసి తప్పు చేశాను. అయితే, సీక్వెల్‌లో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తారు. అలాగే కార్తీ లేకుండా సినిమా ఉండదు. ఇది చాలా క్లిష్టమైన కథ. భారీ బడ్జెట్ కావాల్సి ఉంది. నిర్మాత కోసం చూస్తున్నాం. ఏడాది పాటు నటీనటుల డేట్స్ అవసరం అవుతాయి.' అని తెలిపారు.