Saindhav Movie: సీనియర్ హీరో వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘సైంధవ్’. సంక్రాంతికి విడుదలకు సిద్ధమయ్యి.. ఇతర కమర్షియల్ చిత్రాలకు పోటీపడాలనుకుంటున్న ‘సైంధవ్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ గురించి మీడియాతో ముచ్చటించారు. ఇక ట్రైలర్‌లో చూపించినట్టుగానే రూ.17 కోట్ల ఇంజెక్షన్ అనేది ఉంటుందా లేదా సినిమా కోసం రాసుకున్న ఫిక్షనల్ పాయింటా అని శైలేష్‌కు ప్రశ్న ఎదురయ్యింది. దీంతో ఈ రూ.17 కోట్ల ఇంజెక్షన్ ఐడియా అనేది తనకు ఎలా వచ్చిందో బయటపెట్టాడు శైలేష్.


స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ..
‘‘నిజంగానే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనేది దేశంలో చాలా పెద్ద సమస్యగా తయారయ్యింది. వేలల్లో పిల్లలకు ఈ సమస్య ఉందని బయటపడుతోంది. డాక్టర్లు కూడా దీని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. గతంలో ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవారు. కానీ ఇప్పుడు సమస్య గురించి బయటపడుతోంది. దానికి ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ సమస్య ఉన్న పిల్లలు శరీరంలో ఒక జీన్ లేకుండా పుడతారు. దాని వల్ల శరీరంలో ఒకొక్క అవయవం ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు. చాలా చిన్న వయసులో వాళ్లకి ఈ జీన్‌ రిప్లేస్‌మెంట్ ఇస్తే వాళ్లు కోలుకొని ఎక్కువకాలం బ్రతుకుతారు. దీనికి ఉపయోగపడే ఇంజెక్షన్‌‌కు 2 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.17 కోట్లు’’ అంటూ ‘సైంధవ్’ సినిమాలో చూపించిన సమస్య గురించి, దానికి ఉపయోగపడే ఇంజెక్షన్‌పై తన చేసిన రీసెర్చ్ గురించి చెప్పుకొచ్చాడు శైలేష్.


సోషల్ మీడియాలో ప్రచారాలు..
‘‘ఆ ఇంజెక్షన్‌ను అందరూ కొనగలరా లేదా అన్నదానికి సంబంధం లేకుండా దానికి ఒక రేటును ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. రూ.17 కోట్ల ఇంజెక్షన్ గురించి డబ్బులు సేకరిస్తున్నామని చెప్తుంటారు. అవన్నీ ఈ ఇంజెక్షన్ గురించే. నిజంగానే దేశంలో జరుగుతున్న సమస్య ఇది. నేను కథలో ఆ సమస్యను తీసుకొని.. దాని చుట్టూ ఒక డ్రామాను క్రియేట్ చేశాను’’ అని బయటపెట్టాడు శైలేష్. పైగా ‘సైంధవ్’లో మెసేజ్‌లు లాంటివి ఏమీ లేవని క్లారిటీ ఇచ్చాడు. చాలామందికి ఈ మెడికల్ సమస్య గురించి తెలియదని, తనకు తెలియడానికి కారణమేంటి, ఇదేమైనా నిజ జీవిత కథకు ఆధారంగా తెరకెక్కించిన సినిమానా అని శైలేష్‌కు ప్రశ్న ఎదురయ్యింది. 


వెంకటేశ్ హీరో అయితే కనెక్ట్ అవుతారు..
‘‘కోవిడ్ సమయంలో దీని గురించి సాయం కావాలని నా దగ్గరకు వచ్చాడు. అప్పటినుండి ఈ సమస్య గురించి రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. పిల్లల ఆరోగ్య సమస్యకు మందు లేకుండా చనిపోతున్నారంటే తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్లిపోవచ్చు. కానీ మన దగ్గర రూ.17 కోట్లు ఉంటేనే మన పిల్లలను కాపాడుకోగలము అంటే అది చాలా బాధాకరం. ఆ బాధను ఒక తండ్రి పాత్రలో వెంకటేశ్‌ను చూపిస్తే.. అందరూ బాగా కనెక్ట్ అవుతారు అనుకొని నేను సినిమా తీశాను’’ అని ‘సైంధవ్’కు వెంకటేశ్‌ను హీరోగా ఎంపిక చేసుకోవడానికి కారణాన్ని తెలిపాడు దర్శకుడు శైలేష్ కొలను.


Also Read: యావరేజ్ సినిమాలకు డబ్బులిచ్చి పాజిటివ్ రివ్యూలు చెప్పిస్తున్నాం - కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్