Producer Dil Raju : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్'(Animal) మూవీ డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వల్ల భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు(Dil Raju) మీడియా వేదికగా తెలియజేశారు. 'యానిమల్' మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిందని అన్నారు.


అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకి రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, ఈ వారాంతంలోనే రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీన్నిబట్టి 'యానిమల్' మూవీతో దిల్ రాజుకి భారీగా లాభాలు దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. యానిమల్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. "సినిమా గ్లోబల్ అయిందని చెప్పడానికి ఈ సినిమా విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాన్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం" అని అన్నారు. అనంతరం తమ బ్యానర్లో రూపొందుతున్న కొత్త సినిమాల గురించి కూడా స్పందించారు.


ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నాలుగు సినిమాలు, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. శంకర్ - రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్న 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా సంక్రాంతి బరిలో పోటీపడుతున్న మహేష్ బాబు 'గుంటూరు కారం'(Guntur Kaaram) వెంకటేష్ 'సైంధవ్'(Saindhav) చిత్రాన్ని నైజంలో తానే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.


అలాగే సంక్రాంతికి రావలసిన విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'(Family Star) సినిమాని మార్చ్ లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. కాగా రెండో రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Also Read : దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి - శ్రీలంకలో రానా తమ్ముడి వివాహ వేడుకలు, పెళ్లి ఎప్పుడంటే?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply