Dil Raju announces Eagle Release Date: సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమాలు విడుదలవుతుండగా.. ప్రతీ ఒక్కరి సినిమా ఒకేవిధంగా ప్రేక్షకులకు మెప్పించకపోవచ్చు. పైగా ఒకేసారి విడుదల వల్ల కలెక్షన్స్‌పై కూడా గట్టి ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈ అయిదు సినిమాలలో ఒకటి స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. అదే ‘ఈగల్’. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ.. పోటీని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. అయితే రవితేజ చేసిన ఈ సాయానికి వారికి ఏ పోటీ లేకుండా ఒక సోలో రిలీజ్ డేట్ ఇచ్చామని, కొత్త విడుదల తేదీని తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.


నిర్మాతకు చాలా నష్టం


‘‘ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారంటే.. ఆ హీరో ఫ్యాన్సే కో ఆపరేట్ చేసినందుకు కాలర్ ఎగరేయాలి. ఇది అంత ఈజీ కాదు. సినిమా కాపీ రెడీగా పెట్టుకొని మూడు, నాలుగు వారాలు విడుదలను పోస్ట్‌పోన్ చేయాలంటే ఒక నిర్మాతకు ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో తెలుసా? ఎకానమీ చాలామందికి తెలియదు. మాకు నిర్మాతలుగా ప్రతీ రూపాయి లెక్క ఉంటుంది. ఒక నెల సినిమాను వాయిదా చేయాలంటే.. పెట్టుబడి పెట్టి, కాపీ రెడీ చేసి రిలీజ్‌ను వెనక్కి తోయాలి. అంత డ్యామేజ్ ఉంటుంది నిర్మాతకు. హీరోకు కూడా అంతే. సంక్రాంతికి ఉండే కిక్ వేరే దగ్గర తగ్గుతుంది. సోలోగా వచ్చినప్పుడు ఎకనామిక్స్ పరంగా ఎక్కువ లాభం ఉంటుంది. అయిదు సినిమాలతో వచ్చేదానికంటే సోలోగా వస్తే లాభం ఎక్కువ ఉంటుంది. కానీ సంక్రాంతి అనేవరకు కోడిపందెలలాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలి అనే ఆతృత ఉంటుంది’’ అంటూ ఒక మూవీ విడుదలను పోస్ట్‌పోన్ చేస్తే నిర్మాతకు జరిగే నష్టం గురించి వివరించారు దిల్ రాజు.


సోలోగా ‘ఈగల్’ రిలీజ్‌కు ప్రయత్నాలు


‘‘ఈగల్ ఫిబ్రవరి 9న రావడానికి డేట్ అడిగారు. ఆ సినిమా 9కు రావాలి. కానీ ఇప్పటికే రెండు సినిమాలు ఆ విడుదల తేదీని అనౌన్స్ చేశాయి. ఆ రెండు సినిమాల నిర్మాతలతో కూడా మాట్లాడాము. వాళ్లని ఒప్పించి.. ఫిబ్రవరి 9న ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాం. నిర్మాత నాగవంశీకి ‘గుంటూరు కారం’ రిలీజ్ రెడీగా ఉంది కాబట్టి ఆయన వెంటనే ‘డీజే టిల్లు 2’ను పోస్ట్‌పోన్ చేయడానికి ఓకే చెప్పారు. ఇంకొక మూవీ ‘యాత్ర 2’ ఉంది. దాని నిర్మాత ఇంకా కాంటాక్ట్ కాలేదు. ఆయనతో కూడా మాట్లాడి వీలైతే ఇంకొక వారం ముందు అయినా, తరువాత అయినా విడుదల తేదీ చూసుకోమని అడుగుతాము’’ అంటూ ‘ఈగల్’ కొత్త విడుదల తేదీ ఫిబ్రవరి 9 అని అనౌన్స్ చేశారు దిల్ రాజు. ఇక సంక్రాంతి రేసు నుంచి ఒకరు తప్పుకుంటే బాగుంటుంది అని చర్చ వచ్చినప్పుడు రవితేజ కూడా కో ఆపరేట్ చేయమని చెప్పడంతో తాము రేసు నుంచి తప్పుకున్నామని ‘ఈగల్’ నిర్మాత తెలిపారు. ఈ విషయాన్ని ఆఫీషియల్‌గా కూడా ప్రకటించారు. ‘‘బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం. మొండోడి మనసు పుట్ట తేనె. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫీబ్రవరికి తీసుకొచ్చాడు. మారింది తేదీ మాత్రమే మాసోడి మార్క్ కాదు’’ అని తెలిపాడు. ఫిబ్రవరి 9న తెలుగు, హిందీలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని వెల్లడించారు.






రవితేజనే కారణం


ఇప్పటికే కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ మూవీ పోస్ట్‌పోన్ అవుతుంది అని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవ్వగా దిల్ రాజు దానిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు ఏ పోటీ లేకుండా ఫిబ్రవరి 9న ఈ మూవీ వస్తుందని అనౌన్స్ కూడా చేశారు. రూ.50 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని, అందరికీ హెల్తీ పోటీని ఇవ్వడం వెనుక హీరోనే ముఖ్య కారణమని నిర్మాతలు రవితేజను ప్రశంసించారు. ‘ఈగల్’లో రవితేజ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా నటించారు.


Also Read: హీరోయిన్ల ముఖం చూడను, శ్రీదేవి నడుమును కడవతో పోల్చడానికి కారణం అదే - రాఘవేంద్ర రావు