Raghavendra Rao about Sridevi: తెలుగు సినీ పరిశ్రమలో వందకుపైగా సినిమాలు చేసి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు కే రాఘవేంద్ర రావు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దర్శకేంద్రుడు సినిమాలకు తను ఉపయోగించే సక్సెస్ ఫార్ములాను బయటపెట్టాడు. దాంతో పాటు ఇతర దర్శకులకంటే తాను మాత్రమే హీరోయిన్స్‌ను ఎలా అందంగా చూపించగలగరు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా శ్రీదేవి నడుమును కడవతో పోలుస్తూ కామెంట్ చేశారు.


ఫ్యామిలీ ప్రేక్షకులు తగ్గిపోయారు..
‘‘మన సినిమాతో పాటు విడుదలయ్యే సినిమా రిజల్ట్‌పై ఈ మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. రెండిటిలో ఒకే మూవీ సక్సెస్ అయితే బాగా కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫార్ములా చెల్లదు. ఎందుకంటే ఓటీటీలు వచ్చాయి, టికెట్ రేట్లు పెరిగాయి, పాప్‌కార్న్ రేట్లు పెరిగాయి. పెద్ద సినిమా అయితే తప్పా ఫ్యామిలీ అంతా థియేటర్‌కు రావడం లేదు. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు సిటీల్లో ఆడినా.. ఊర్లలో ఆడవు. అక్కడ కమర్షియల్ సినిమాలు అయితేనే వర్కవుట్ అవుతాయి. డిస్ట్రిబ్యూటర్లు అదే చెప్తారు. ఊర్లో ప్రేక్షకులకు మాస్‌గా ఉండాలి, సినిమా బాగా అర్థమవ్వాలి. హిట్ అయ్యిందే మంచి సినిమా అనుకునే రోజులు వచ్చేశాయి. టైమ్‌తో పాటు మనం కూడా మారాలి’’ అని సినిమాలు చూస్తున్న ప్రేక్షకుల మనస్థత్వం ఎలా మారుతుందో బయటపెట్టారు రాఘవేంద్ర రావు.


ఎంత చేసినా శ్రీకాంత్.. చిరంజీవి అవ్వలేడు


‘‘అడవి రాముడు ఒక చిన్నతో హీరోతో తీస్తే అంత ఆడదు. ‘పదహారేళ్ల వయసు’ ఎంత ఆడినా కూడా చంద్రమోహన్.. ఎన్‌టీఆర్ అవ్వడుగా. ‘పెళ్లి సందడి’ సంవత్సరం ఆడింది. శ్రీకాంత్.. చిరంజీవి అవ్వడుగా. దానికి కూడా ఒక లెక్క ఉంది. శ్రీకాంత్‌కు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తేనే లాభం వస్తుంది. చిరంజీవికి ఇంత బడ్జెట్ అయినా పెట్టొచ్చు. ‘పెళ్లి సందడి’ 100 రోజులు ఆడింది. సినిమా సబ్జెక్ట్‌కు ఉన్న వాల్యూకు శ్రీకాంత్ సపోర్ట్‌గా నిలిచాడు. ఆ మూవీలో అందరూ కొత్తవాళ్లే. ఎవరికీ పెద్దగా స్టార్‌డమ్ లేదు. మ్యూజిక్, పంచులు, జోకులు వర్కవుట్ అయ్యాయి. స్టార్ హీరో ఉన్నప్పుడు 50 శాతం ఆలోచిస్తే.. మిగతా 50 శాతం ఆటోమేటిక్‌గా లాభాలు వచ్చేస్తాయి. హీరోయిజం తక్కువ ఉన్నవారికి దర్శకుడి సపోర్ట్ ఉండాలి. ఎంటర్‌టైన్మెంట్ కావాలి’’ అంటూ తన గత సినిమాల అనుభవాలను గుర్తుచేసుకున్నారు దర్శకేంద్రుడు. దాంతో పాటు ‘త్రిశూలం’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఫెయిల్ అయినా వైజాగ్‌లో మాత్రమే ఆడిందని, అక్కడ మాత్రమే అది వర్కవుట్ అయ్యిందని అన్నారు.


మైనస్‌లను కవర్ చేయాలి


‘‘సినిమాలు ప్రేక్షకుల హృదయాలకు టచ్ అవ్వాలి. కానీ అందులో మంచి ఆలోచన ఉంది అనే అంశాన్ని ఆడియన్స్ మీద రుద్దకూడదు’’ అని సినిమాలు ఎలా ఉండాలి అనేదానిపై తన అభిప్రాయాన్ని చెప్పారు రాఘవేంద్ర రావు. ఇక హీరోయిన్లను ఇతర దర్శకులకంటే తానే ఎలా అందంగా చూపిస్తారని అడగగా.. ‘‘ఒకసారి రాజమౌళి కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు హీరోయిన్ అనగానే ముఖం అయితే చూడను అని సరదాగా సమాధానమిచ్చాను. ఎవరూ పూర్తిగా అందంగా ఉండరు. మైనస్‌లను పక్కన పెట్టి సినిమాలో చూపించాలి. అందరికీ నడుము బాగుండదు. శ్రీదేవి నడుము కడవలాగా ఉంటుంది. అందుకే ఒక పాటలో తన నడుమును కడవతో పోలుస్తూ షాట్ ఉంటుంది. ఏది ఎక్కువ అందంగా ఉంటుందో.. అదే ఎక్కువ చూపించాలి. మైనస్‌లు కవర్ చేయడమే ఫార్ములా’’ అంటూ హీరోయిన్స్‌ను తన అందంగా చూపించే సీక్రెట్ ఫార్ములాను బయటపెట్టారు రాఘవేంద్ర రావు.


Also Read: ఆ హీరో సినిమా లైఫ్ చేంజ్ చేసింది - నటి కరుణ భూషణ్