Aha Movie Special Single Take Shot : జగపతిబాబు హీరోగా వచ్చిన ఆహా సినిమా మంచి విజయం సాధించింది. రఘువరన్, జయసుధ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాలో ఓ సీన్ దాదాపుగా పది నిమిషాల పాటు కట్స్ లేకుండా సాగుతుంది. ఆ సీన్ ను షూట్ చేయడం ఆషామాషీ కాదు. ఎలా చేశారో ఇప్పటికీ ఓ అద్భుతమే. అలా ఎలా చేయగలిగారో.. ఆ సినిమా  కో డైరక్టర్ గా పని చేసిన దేవీప్రసాద్ సోషల్ మీడియాలో వివరించారు. ఆయన పోస్టు వైరల్ అవుతోంది. 

ఆహా సినిమాలో అతి పెద్ద సీన్    "హీరో తన ప్రేమ గురించి బాధపడుతుంటే తల్లి(అన్నపూర్ణ),వదిన(జయసుధ),బామ్మ,తాత,అందరూ తాము తండ్రి(విజయకుమార్)ని ఒప్పిస్తామని చెప్పటం, అప్పుడేవచ్చిన ఆయనకి హీరో ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడని అబద్ధం చెప్పటం, ఈలోగా అమ్మాయి తండ్రి(చంద్రమోహన్)సంబంధం మాట్లాడటానికి రావటం, కొంత చర్చ తరువాత అతను కేవలం వంటవాడని తెలిసి హీరో తండ్రి తిట్టడం, వాళ్ళిద్దరిమధ్య ఘర్షణ, అతను వెళ్ళాక తండ్రి కొడుకుని తిట్టడం, హీరోని వదిన ఓదార్చివెళ్ళాక అన్న(రఘువరన్)ఇంట్లోకి రావటం, ఫోన్ రింగ్ అయితే హీరో లిఫ్ట్ చేస్తే అవతలనుండి ఓ ఆడగొంతు అన్నయ్యగురించి అడగటం, ఫోన్ తీసుకున్న అన్నయ్య సార్ సార్ అంటూ మాట్లాడి అర్జెంట్ మీటింగ్ ఉందని తిరిగి వెళ్ళిపోవటం, తండ్రి అన్నయ్యని చూసైనా నేర్చుకో అని తిట్టడం, అన్నయ్య అబద్ధం ఎందుకు చెప్పాడు అని హీరో ఆలోచించడం" ఇదంతా సినిమాలో ఒక రీల్ కి సరిపోయేంత లెంగ్త్ ఉన్న సన్నివేశం. 

మొదటి సారి చేసింది రీల్ పాడైపోయింది !  

సాధారణంగా ఏ దర్శకులైనా ఆ సన్నివేశాన్ని ఎన్నో షాట్స్ గా విభజించి చిత్రీకరణ జరుపుతారు. కానీ దర్శకుడు సురేష్ కృష్ణ మాత్రం  మొత్తం సింగిల్ షాట్‌లో చిత్రీకరించాలనుకున్నారు. అదీ "స్టడీ క్యాం"లాంటివి ఉపయోగించకుండా కేవలం ట్రాక్&ట్రాలీ తో.అప్పటికి "గింబల్" రాలేదని దేవీప్రసాద్ గుర్తు చేసుకున్నారు.  అసిస్టెంట్‌డైరెక్టర్స్‌ని,కెమేరా అసిస్టెంట్స్‌ని,ఆర్ట్ అసిస్టెంట్స్‌ని నటీనటుల స్థానాలలో సెట్లో అటూఇటూ నడిపిస్తూ ఎప్పుడెవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెబుతూ,ఏ టైంలో కెమేరా ఎక్కడెక్కడికి వెళ్ళాలో,ఎక్కడిదాకా వెళ్ళాక క్రింద పడుకుని వుండే ట్రాక్&ట్రాలీ డిపార్ట్‌మెంట్‌వాళ్ళు క్రింద ట్రాక్ సైలెంట్‌గా పీకేసి దానికి రౌండ్‌ట్రాలీ ఎలా ఫిక్స్ చెయ్యాలో అంతా క్లియర్‌గా వివరిస్తుంటే మతిపోయింది అందరికీ.  ఆయన షాట్ కంపోజిషన్ అద్భుతం.   నటీనటులైతే విషయం చెప్పగానే అమ్మో సాధ్యమా అన్నారని..  "మీరేం కంగారుపడకండి. మీరు ప్రిపేర్ అవ్వండి. దేవీ మొత్తం డైలాగ్స్ ప్రాంప్ట్ చేస్తాడు"అన్నారని దేవీప్రసాద్ పోస్టులో వివరించారు. 

స్పెషల్‌గా బోంబే నుండి 1000 ఫీట్ క్యాన్  

అప్పట్లో డిజిటల్ కాదు. మానిటర్స్ లేవు. అప్పట్లో షూట్‌చేసే నెగెటివ్ క్యాన్‌లో 400 అడుగులు నెగెటివ్ మాత్రమే ఉంటుంది. స్పెషల్‌గా బోంబే నుండి 1000 ఫీట్ క్యాన్ తెప్పించారని దేవీ ప్రసాద్ తెలిపారు.  ఉదయం 9 గంటలకు నటీనటులని మేకప్ లేకుండా రమ్మని సెట్ లో కెమేరాతో సహా అన్ని కదలికలనూ వివరించారు డైరెక్టర్. వెళ్ళి మధ్యాహ్నం 4 గంటలకు మేకప్ తో రమ్మన్నారు.ఈ లోపు సెట్ అంతా లైటింగ్ చేశారు కెమేరామెన్ శరవణన్. మధ్యాహ్నం నటీనటులు రాగానే ఒక్కసారి రిహార్సల్ చేసి టేక్ అన్నారు.  నటీనటులందరూ ప్రాప్టింగ్ చేయాల్సిన నావైపు నీదే భారం అన్నట్లు చూస్తుంటే టెన్షన్ వచ్చేసింది.షాట్ మధ్యలో ఎక్కడ ఆగినా 1000 అడుగుల నెగెటివ్ వేస్ట్ అయిపోతుంది. డైరెక్టర్‌  యాక్షన్ అనగానే యజ్ఞం మొదలైంది. ఎవరిపని వాళ్ళు కరెక్ట్ గా చేశారు. ఫిల్మ్ 892 అడుగులు తిరిగాక సీన్ పూర్తయ్యి డైరెక్టర్‌ కట్ అని అరిచారు. ఓకే అనగానే చప్పట్లు మారుమ్రోగాయి.  అప్పటికప్పుడు ల్యాబ్ కి వెళ్ళింది నెగెటివ్.    1000 ఫీట్ క్యాన్స్ వాడకంలో లేకపోవటం వల్ల ఆ నెగెటివ్ ఫాగ్ అయ్యి ప్రింట్ పైన మచ్చలువచ్చాయని ల్యాబ్ రిపోర్ట్.   మరొక దర్శకుడైతే మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోరు. కానీ ఆయన సురేష్‌కృష్ణ. నో కాంప్రమైజ్. మళ్ళీ అందరినీ మోటివేట్ చేసి అదేతరహా చిత్రీకరణకి సిద్ధమయ్యారు.  బోంబే ల్యాబ్ వాళ్ళు ఈసారి 1000 ఫీట్ క్యాన్ చెక్ చేసిమరీ ఫ్రీగానే పంపారు.  రెండోసారి అందరూ టెన్షన్ పడకుండానే చేశారు. ఇప్పుడా షాటే సినిమాలో ఉన్నదని దేవీ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

  "సినిమాలో ఓ షాట్ చిత్రీకరణ జరిగిందంటే అది చరిత్రలో శాస్వతంగా నిలిచిపోతుంది మళ్ళీ మార్పుచేర్పులుండవు"అనే స్పృహని ఎల్లప్పుడూ కోల్పోకుండానే ఉంటారు గొప్ప దర్శకులు.  ఆయనే "భాషా" సినిమాలో రజనీకాంత్‌తో "నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు" అనే డైలాగ్ చెప్పించినట్లు "సురేష్‌కృష్ణ  తో నేనొక్క సినిమాకే పనిచేసినా అది వందసినిమాలకు సమానం"...అని దేవీప్రసాద్ గురువుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సీన్ ను యూట్యూబ్‌లో చూడవచ్చు. దేవీప్రసాద్ తర్వాత దర్శకుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు నటుడిగా కూడా మారారు.