బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేకు బ్యాడ్మింటన్ కొత్త కాదు, రాని ఆట కూడా కాదు. ఆమె సినిమాల్లోకి రాక ముందు మంచి షటిల్ ప్లేయర్. అంతెందుకు దీపికా తండ్రి ప్రకాష్ ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాళ్లలో ఒకరు. పలు పతకాలు కూడా సాధించారు. నాన్న దగ్గరే ఆట నేర్చుకుంది దీపికా. అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో ఆటను పక్కన పెట్టేసింది. అవకాశం దొరికినప్పుడల్లా మాత్రం బ్యాట్ పట్టుకుంటూనే ఉంటుంది. 


తాజాగా ఆమె ఒలింపిక్ విజేత పీవీ సింధుతో కాసేపు బ్యాడ్మింటన్ ఆడి ఛిల్ అయ్యింది. ఆ వీడియోను, ఫోటోలను తన అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేసింది. వీడియోలో చూస్తుంటే దీపికా ఆట ఏమాత్రం మరిచిపోలేదని అర్థమవుతుంది. ‘ ఇది నార్మల్‌ డేనే... పీవీసింధుతో ఆడుతూ కెలోరీలు కరిగించుకుంటున్నా’ అని క్యాప్షన్ పెట్టింది. దీనికి పీవీ సింధు తన ‘ఎన్ని కేలరీలు కరిగించావ్?’ అంటూ కామెంట్ చేసింది. 


పీవీ సింధు తన ఇన్ స్టా ఖాతాలోనూ వారిద్దరి ఆట తాలూకు ఫోటోలను షేర్ చేసి, ‘మళ్లీ ఎప్పుడు ఆడదాం’ అంటూ దీపికను ప్రశ్నించింది.  వారి పోస్టులు అభిమానుల్లో ఆసక్తిని, ఆనందాన్ని పెంచాయి. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి