తెలుగమ్మాయి సుమయ రెడ్డి (Sumaya Reddy) కథ అందించడంతో పాటు ప్రొడ్యూస్ చేసిన సినిమా 'డియర్ ఉమ' (Dear Uma Movie). ఇందులో హీరోయిన్ కూడా ఆ అమ్మాయే. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాలో పృథ్వీ అంబర్ హీరో. సాయి రాజేష్ మహాదేవ్ కథనం, మాటలు రాయడంతో పాటు  దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

కథపై క్లారిటీ ఇచ్చిన ట్రైలర్!మెడికల్ మాఫియా నేపథ్యంలో 'డియర్ ఉమ' సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథపై మరింత క్లారిటీ ఇచ్చారు. హీరోకి సింగర్ కావాలని కోరిక. అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. హీరోయిన్ ఏమో డాక్టర్. వాళ్లిద్దరూ ప్రేమలో పడతాడు. రెండు వేర్వేరు రంగాల్లో ఉన్న వీళ్లిద్దరూ మెడికల్ మాఫియా మీద పోరాటం చేస్తారు. సింగర్ కావాలనుకున్న హీరోని పేరెంట్స్ ఇంటి నుంచి గెంటేస్తే... హీరోయిన్‌ను కార్పొరేట్ ఆస్పత్రులు టార్గెట్ చేస్తాయి. ఇద్దరిని హత్య చేయించేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతాయి. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'కార్పోరేట్ కబంద హస్తాల నుంచి వైద్య రంగాన్ని బయటకు తీసుకు రండి' అని హీరో చెప్పడంలోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు.

అమ్మ మద్దతు ఇవ్వడంతో నిర్మాతగా...మంచి కంటెంట్‌ ప్రేక్షకులకు అందించాలని 'డియర్ ఉమ' చేసినట్టు నిర్మాత & హీరోయిన్ సుమయా రెడ్డి తెలిపారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''మా దర్శకుడు రాజేష్ గారితో నాది ఎన్నో ఏళ్ల పరిచయం. తన కథలన్నీ పక్కన పెట్టి నా కథ మీద ఆయన దృష్టి పెట్టారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టే నిర్మాత ఎవరని చూస్తున్న సమయంలో మా అమ్మ సపోర్ట్ చేసింది. నాకు 'అందాల రాక్షసి' పాటలు ఇష్టం. ఆ మూవీకి మ్యూజిక్ చేసిన రధన్ గారు మా సినిమా ఒప్పుకొంటారా? లేదా? అనుకున్నా. కథ విన్న వెంటనే ఓకే అన్నారు. నన్ను నమ్మిన మా హీరో పృథ్వీ గారికి, యూనిట్ అందరికీ థాంక్స్. ఏప్రిల్ 18న థియేటర్లలో సినిమా చూసి సక్సెస్ చేయండి'' అన్నారు.

Also Read: హనుమాన్ జయంతి స్పెషల్... చిరు 'విశ్వంభర'లో 'రమ  రామ' సాంగ్ వచ్చేసిందోచ్

తెలుగులో 'దియా' రిలీజ్ తరువాత తనకు ఫాలోయింగ్ పెరిగిందని పృథ్వీ అంబర్ తెలిపారు. 'డియర్ ఉమ' తన తొలి తెలుగు సినిమా అని చెప్పారు. సంగీత దర్శకుడు రధన్ మాట్లాడుతూ... ''సుమయ గారు భుజానికి ఎత్తుకుని మరీ ఈ మూవీ చేశారు. ఆమె ప్యాషన్‌ చూసి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చా. మంచి పాటలు, ఆర్ఆర్ కుదిరాయి'' అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కమల్ కామరాజ్, దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్, సుమయ రెడ్డి తల్లి జ్యోతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నితిన్ సాయి చంద్ర రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ నాగేశ్, ఎడిటర్ సత్య, నటుడు లోబో పాల్గొన్నారు.

Also Readఇంకో వారం వెనక్కి వెళ్లిన సారంగపాణి... 'ఓదెల 2', 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'తో క్లాష్ లేకుండా!