ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినీ ఇండస్ట్రీలోకి... తన నేచురల్ హావభావాలతో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు 'నాని'. తన విలక్షణమైన నటనతో భిన్నరకాల సినిమాలు చేస్తూ ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి నేడు పాన్ ఇండియా సినిమా తీసే స్థాయికి ఎదిగాడు. 'దసరా' సినిమాతో మొదటి పాన్ ఇండియా చేయబోతున్న నానికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేయడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సొంతం చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దానికి కారణం ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడమే.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'దసరా' సినిమాలో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ మూవీ 'శ్రీరామనవమి' కానుకగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుండడంతో అందరి దృష్టి బుక్ అవుతున్న టికెట్లపై పడింది. అల్లు అర్జున్ 'పుష్ప', యశ్ 'కేజీఎఫ్'లతో పోటీ పడుతూ.. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ లు నమోదవుతున్నాయి. దీంతో నాని పాన్ ఇండియా మూవీ బెస్ట్ ఓపెనింగ్‌ల రికార్డును బ్రేక్ చేయడానికి సిద్ధమవుతోందని సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నందున ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ మంచి ఫ్లోలో వెళుతోంది. ఈ మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వస్తోంది.
'దసరా' సినిమాకు మొదటి రోజు ఇండియా అంతటా 86,000 టిక్కెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అన్ని భాషలలో కలిపి రూ. 1.6 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తోంది. ఇందులో ఒరిజినల్ తెలుగు వెర్షన్ నుంచే రూ.1.57 కోట్లు రాబట్టడం విశేషం. దసరా పాన్-ఇండియా చిత్రంగా వస్తుండగా.. అడ్వాన్స్ బుకింగ్ డబ్బింగ్ వెర్షన్‌ల సందడి ఇప్పటివరకు కొంచెం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ గత రెండు రోజులుగా పుంజుకోవడంతో.. నాని సినిమా కొత్త రికార్డులను నెలకొల్పుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు . ఇది నాని ఇప్పటివరకు చేసిన సినిమాల కన్నా అత్యధికమని, ఇప్పుడు నమోదైన వాటిలో 50% మాత్రమే ఇంతకుముందు సినిమాలు నమోదు చేశాయని చెబుతున్నారు.
నాని నటించిన 'నిన్ను కోరి', 'భలే భలే మగాడివోయ్' రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి ఉత్తమ ప్రదర్శన చిత్రాలలో ఒకటిగా నిలిచాయి. ఇప్పుడు దసరా మొదటి వారంలోనే ఈ సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్‌లను అధిగమిస్తుందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అంతటా 1300 స్క్రీన్‌లతో స్ర్కీనింగ్ అవనుండగా.. ఇది నటుడు నాని కెరీర్‌లోనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది.
టిక్కెట్‌లకు అధిక డిమాండ్ ఏర్పడడంతో అనేక థియేటర్లలో ఈ చిత్రం ఉదయం నుంచే షోలు ప్రారంభం కానున్నాయి. కొన్ని షోలు విడుదల రోజు ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ హీరోగా నాని కనిపిస్తుండగా.. సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసే అమ్మాయిగా కీర్తి సురేశ్ కనిపించనున్నారు. పక్కా మాస్ మసాలా కథతో రాబోతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు.